Janammata.net

కారకులు ఎవరు?

అది ప్రాణాలను హరించిన కాళరాత్రి…కానీ ఆ రాత్రి లోపల ఉన్నవాళ్లకు అది ఓ సాధారణ ప్రయాణం.. ఎప్పటిమాదిరిగానే బస్సులో మరో నిద్ర. ఇంకో సాధారణ ఆశే. చీకటి రోడ్డు మీద వేగంగా దూసుకెళ్తున్న ఎసి స్లీపర్‌ బస్సులో ఎవరి లోకం వాళ్లదే. ఎవరో తల్లి వంటగదిలో చేసే కాఫీ వాసన గుర్తు చేసుకుంటున్నారు.. ఎవరో పిల్లల పాఠశాల ఫీజు ఎలా కట్టాలా అని లెక్కలు వేసుకుంటున్నారు.. ఎవరో ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎవరో పెళ్లి చూపులకి వెళ్లి తిరిగి వస్తున్నారు, ఎవరో అంత్యక్రియలకి ఆలస్యమైపోతున్నామేమోనని గడియారం చూస్తున్నారు.. ఎవరి లోకం వారిది.. ఎవరి ఆలోచనలు వారివి. ఇవేవీ పట్టని ఆ బస్సు మాత్రం గడియారాన్ని దాటేసి, కాలాన్నే మించిపోతూ పరుగులు తీస్తోంది. డ్రైవర్‌ చేతిలో స్టీరింగ్‌ ఉంది, కానీ ఆ స్టీరింగ్‌ మీద అతడి జీవితం మాత్రమే కాదు, వెనుక నిద్రపోతున్న ప్రతి మనిషి భవితవ్యం వేలాడుతోంది అన్న నిజం అతడికి తెలుసో లేదో ఎవరికీ తెలియదు. తెలిసినా తెలియనట్టే నటించాడో లేదో కూడా తెలియదు. కానీ వేగం మాత్రం ఆ రాత్రి సత్యం. ఎవరూ మాట్లాడలేదు. ఎవరూ అడగలేదు. ఎవరూ ఆపలేదు. ఎందుకంటే అలసిపోయిన శరీరాలు నిద్రను కోరుకున్నాయి. అలవాటు పడిన మనసులు ప్రమాదాన్ని లెక్కచేయడం మానేశాయి. డ్రైవర్‌ చూసుకుంటాడు అన్న నమ్మకం మనలను బాధ్యతల నుంచి విముక్తులను చేస్తుందన్న అబద్ధాన్ని మనం ఎప్పుడో నమ్మడం మొదలుపెట్టాం. బస్సు లోపల చీకటి, బయట చీకటి, మధ్యలో నిద్ర, ఆ నిద్రలోనే మరణం దాగి ఉందని ఎవరు ఊహిస్తారు. ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్‌ కూడా ఆ రాత్రి సాధారణ మనిషే, అతడికీ ఇంట్లో ఎవరో ఎదురు చూస్తున్నారు, అతడికీ పని ఒత్తిడి ఉంది, అతడికీ అలసట ఉంది, కానీ రెండు వాహనాల మధ్య ఉన్న ఆ క్షణం మాత్రం అసాధారణం, ఎందుకంటే అది రెండు జీవితాల సంగమం కాదు, వందల జీవితాల ముగింపు. ఢీకొన్న శబ్దం కొండకోనల్లో ప్రతిధ్వనించింది, గాల్లోకి ఎగిరిన బస్సు క్షణాల్లోనే లోయలో పడిపోయింది, ఆ శబ్దంతో కలిసి నిద్రలు విరిగాయి, కలలు చిదిరిపోయాయి, శరీరాలు చీలిపోయాయి, రక్తం రోడ్డు మీద మాత్రమే కాదు, గాల్లో కూడా ఎగిరింది.అక్కడ ఇక సమయం లేదు, క్రమం లేదు, మానవత్వం అనే మాట కూడా తాత్కాలికంగా చచ్చిపోయింది. ఎవరి చేయి ఎవరి కాలో తెలియదు, ఎవరి రక్తం ఎవరిదో తెలియదు, ఎవరి అరుపు ఎవరిదో కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో కొందరు నిద్రలోనే చనిపోయారు, వారికి బాధ తెలియలేదు, కానీ కొందరు మాత్రం చావు అంచున నిలబడి సహాయం కోసం అరుస్తూ, నీళ్ల కోసం వేడుకుంటూ, ఎవరో ఒకరు వస్తారన్న ఆశతో గడిపిన ప్రతి క్షణం నరకంగా మారింది. ఆ అరుపులు అడవిని చీల్చాయి, కానీ వినేవాళ్లు లేరు, ఆ చేతులు చీకట్లో తడిమాయి, కానీ పట్టుకునే ఇంకో చేయి లేదు. తెల్లవారే సరికి దృశ్యం మరింత భయంకరంగా మారింది, రాత్రి దాచిన శవాలను వెలుతురు బయటపెట్టింది, పత్రికల ఫోటోలకు సరిపోయే కోణాలు వెతికారు, కెమెరాలు వచ్చాయి, మైకులు వచ్చాయి, కానీ ఆ దృశ్యాన్ని చూసి ఎవరి గొంతు కూడా కంపించలేదు, ఎందుకంటే ఇలాంటి దృశ్యాలు మనకు కొత్తవి కావు, మనం ఇలాంటి మరణాలకు అలవాటు పడిపోయాం. రోడ్డు ప్రమాదం అన్న రెండు మాటలతో వందల జీవితాలను మూసేస్తాం, ఫైల్‌ క్లోజ్‌ చేసినట్టు. బతికినవాళ్లు మాత్రం ఆ క్షణం నుంచి జీవచ్ఛవాలు అయ్యారు. ఎవరికో కాలు లేదు, ఎవరికో చేయి లేదు, ఎవరికో కన్ను లేదు, కానీ అందరికీ ఒకటే లోటు, వాళ్ల జీవితం ఇక మామూలుగా ఉండదు అన్న నిశ్చయం. నిద్రపోతే అదే బస్సు, అదే వేగం, అదే ఢీకొట్టు, అదే అరుపులు, అదే రక్తం కలల్లో తిరిగి వస్తాయి, మేల్కొన్నాక కూడా శరీరం అంతా చెమట, గుండె దడ, ఊపిరి అందని భయం. వాళ్లు బతికారు అని మనం అంటాం, కానీ వాళ్లు బతకడం అంటే ప్రతిరోజూ చావును గుర్తు చేసుకుంటూ జీవించడం.
అప్పుడే మొదలవుతుంది అసలు నాటకం, ఎవరిది తప్పు అన్న ప్రశ్న. డ్రైవర్‌ని పట్టుకుంటారు, మద్యం తాగాడా లేదా అని పరీక్షలు చేస్తారు, అతడి ఫోటో చూపించి వాడే నేరస్తుడు అని తీర్పు చెప్పేస్తారు, యజమాని రెండు రోజులు కనిపించడు, తర్వాత ఒక ప్రకటన విడుదల చేస్తాడు, దురదృష్టకర సంఘటన అని, అధికారులు విచారణ కమిటీ వేస్తారు, రాజకీయ నాయకులు పరామర్శ పేరుతో ఫోటోలు దిగుతారు, పరిహారం ప్రకటిస్తారు, కొంత డబ్బుతో కొంత మౌనం కొనుగోలు చేస్తారు, ఆ తర్వాత మరో వార్త వచ్చేసరికి ఈ కథ పాతదైపోతుంది.
కానీ ఈ ప్రమాదం ఒక్క డ్రైవర్‌ తప్పు మాత్రమేనా అని అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు, ఎందుకంటే అలా అడిగితే మనమే సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. విశ్రాంతి లేకుండా గంటల తరబడి డ్రైవింగ్‌ చేయిస్తున్న వ్యవస్థ తప్పు కాదా, సమయానికి చేరాలన్న ఒత్తిడి పెట్టి వేగాన్ని ప్రోత్సహించే యజమానుల తప్పు కాదా, కాలం చెల్లిన వాహనాలకు లంచాల మీద లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చే అధికారుల తప్పు కాదా, ప్రజా రవాణాను చంపేసి ప్రైవేటు బస్సులపై ఆధారపడే పరిస్థితిని సృష్టించిన పాలకుల తప్పు కాదా, ఇవన్నీ తెలిసినా మౌనంగా ఎక్కి నిద్రపోయిన మన తప్పు కాదా అన్న ప్రశ్నలు అడిగితే సమాధానం ఒక్కరి మీద వేయలేం.
ఎందుకంటే ఇది ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, ఇది ఒక వ్యవస్థ చేసిన హత్య. ఈ దేశంలో ప్రమాదాలు రోడ్ల మీద మాత్రమే జరగవు, అవి ఫైళ్లలో, సంతకాలలో, లంచాల లావాదేవీల్లో, ఏమవుతుందిలే అన్న మన నిర్లిప్తతలో పుడతాయి. ఒక బస్సు ప్రమాదం అంటే రెండు వాహనాలు ఢీకొనడం కాదు, అది ప్రభుత్వ విధానాల ఢీకొట్టు, లాభాల దాహం ఢీకొట్టు, ప్రజల మౌనం ఢీకొట్టు. నేను ఆ బస్సులోనే ఉన్నాను, నేను కూడా నిద్రపోయాను, నేను కూడా వేగం గమనించాను, కానీ నేను కూడా మౌనంగా ఉన్నాను, అందుకే ఈ కథ చెబుతున్నప్పుడు నాకు మాట్లాడే హక్కు ఉందో లేదో కూడా నాకు సందేహమే, అయినా మాట్లాడుతున్నాను, ఎందుకంటే మౌనం ఇంకో కాళరాత్రిని పుట్టిస్తుంది. నేను బతికాను అంటారు, కానీ నిజానికి నేను బతకలేదు, ఆ రాత్రి నుంచి నా జీవితం రెండు భాగాలుగా చీలిపోయింది, ఒకటి ప్రమాదానికి ముందు, ఇంకొకటి ప్రమాదానికి తర్వాత, ఆ తర్వాత భాగంలో ఆశలు లేవు, ప్రణాళికలు లేవు, నిద్ర లేదు, భయం మాత్రమే ఉంది. ఈ కథ విన్నాక మీరు కంటతడి పెట్టవచ్చు, కోపపడవచ్చు, సోషల్‌ మీడియాలో రెండు మాటలు రాయవచ్చు, కానీ మూడో రోజు మర్చిపోతే మీరు కూడా ఈ హత్యలో భాగస్వాములే. ఎందుకంటే బాధ్యత అనేది డ్రైవర్‌ దగ్గర మొదలై అక్కడితో ఆగదు, అది ప్రయాణికుడి దగ్గరికి వస్తుంది, పౌరుడి దగ్గరికి వస్తుంది, ఓటర్‌ దగ్గరికి వస్తుంది. భద్రత అడగడం మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. అతివేగం వద్దు అని అడగడం అసభ్యత కాదు, అది మన ప్రాణాల కోసం చేసే పోరాటం. ప్రజా రవాణా బలంగా ఉండాలని డిమా్‌ండ చేయడం రాజకీయమే కాదు, అది మన జీవితాల ప్రశ్న. ఇంకోసారి ఇలాంటి ప్రమాదం జరిగితే అది దురదృష్టం కాదు, అది మన వైఫల్యం. ఇంకోసారి ఇలాంటి కాళరాత్రి వస్తే అది కాలం తప్పు కాదు, అది మన మౌనం తప్పు. ఈ రక్తం డ్రైవర్‌ చేతుల మీద మాత్రమే లేదు, ఈ రక్తం మనందరి చేతుల మీద ఉంది. ఈ శవాల బరువు ఒక్క బస్సు మీద కాదు, ఈ సమాజం మీద ఉంది. ఇప్పుడు కూడా మనం కళ్లుమూసుకుంటే, రేపు ఇంకో బస్సులో, ఇంకో లారీలో, ఇంకో రోడ్డుపై ఇదే కథ పునరావృతమవుతుంది, అప్పుడూ ఎవరో ఒకరు బతికి బయటపడి ఇలాగే చెబుతాడు, కానీ వినేవాళ్లు లేకపోతే ఆ మాటలు కూడా శవాల్లానే పడిపోతాయి. ఇది కథ కాదు, ఇది హెచ్చరిక. ఇది కన్నీటి కథ కాదు, ఇది బాధ్యత పిలుపు. ఈ హత్యలను ప్రమాదాలు అని పిలవడం మానేసి, ఈ వ్యవస్థను ప్రశ్నించడం మొదలుపెట్టిన రోజే కాళరాత్రులకు తెల్లవారుతుంది, లేకపోతే ఈ చీకటి మనల్ని వదలదు.

Please share
Exit mobile version