విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి భారతదేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ వేసే విధానాన్ని నిలిపివేయనున్నారు.
ఇకపై ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ సమయంలో తమ మొబైల్ ఫోన్లోని ఈ-బోర్డింగ్ పాస్‌ను చూపించవచ్చు. దీంతో తప్పనిసరిగా ప్రింటెడ్ బోర్డింగ్ పాస్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఇప్పటివరకు భౌతిక బోర్డింగ్ పాస్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులకు చూపించి దానిపై స్టాంప్ వేయించుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొన్ని సందర్భాల్లో స్టాంప్ సరిగ్గా పడకపోవడం లేదా స్పష్టంగా కనిపించకపోవడం వల్ల బోర్డింగ్ పాస్ వివరాలను చదవడంలో సమస్యలు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
