Janammata.net

మాయమైన బాల్యం..

మేము అనుభవించిన బాల్యం ఇప్పటి తరాలకు లేదు. ఎక్కడో మాయమైంది. ఆ రోజుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అరవై వసంతాలు దాటిన తర్వాత, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, నా జీవితంలో నిజంగా స్వేచ్ఛగా శ్వాస తీసుకున్న కాలం ఏదైనా ఉందా అంటే… అది నా బాల్యమే. ఆ రోజులు ఒక కలలా అనిపిస్తాయి. అప్పట్లో ఇన్ని సదుపాయాలు లేవు.. ఆధునిక వనరులు లేవు… కానీ జీవితం మాత్రం సంపూర్ణంగా ఉండేది. ఇప్పుడు ఉన్న సౌకర్యాలన్నీ చూసినా, ఆ రోజుల్లో ఉన్న ఆనందం మాత్రం ఎక్కడా కనిపించదు. ఒకప్పుడు గ్రామాలుగానే ఉన్న సికిందరాబాద్‌ శివార్లలోనే పుట్టాను. తప్పడగులు వేశారు. మట్టి వాసన, ఎండిపోయిన చెరువు, పొలాల్లో పనిచేసే మనుషుల శబ్దం… ఇవే మా ప్రపంచం. ఉదయం లేచిన వెంటనే స్కూల్‌కి వెళ్లాలనే తొందర లేదు. ఎందుకంటే చదువు అప్పట్లో భారం కాదు. పుస్తకాల కట్టలు, ట్యూషన్లు, పరీక్షల భయం… ఇవన్నీ మా జీవితంలో లేవు. ఒకటి రెండు పుస్తకాలు, ఒక పలక, ఓ రెండు బలపాలు… ఐదో తరగతి దాటిన తర్వాతే పెన్ను. ఎప్పటికప్పుడు ఇంకు ఎంత ఉందో చూసుకోవడమేకాదు… కొన్ని చుక్కలు అప్పు ఇచ్చి.. మళ్లీ వసూలు చేసుకునేవాళ్లం. టీచరు చెప్పినది వినడం, గుర్తుపెట్టుకోవడం.. అంతే. అంతకు మించిన ఒత్తిడి లేనేలేదు. అమ్మానాన్నా ఎప్పుడూ మార్కులు, ర్యాంకుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అసలు అలాంటి ధ్యాసే లేదు. ‘చదువుకో’ అనేవారు గానీ, ‘ఫస్ట్‌ రావాలి’, ‘టాపర్‌గా ఉండాలి’ అని ఒత్తిడి చేసేవారు కాదు. చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే, జీవితం అంతా కాదు. అందుకే మనసు తేలికగా ఉండేది. ఎలాంటి ఒత్తిడి లేదు. అన్నదమ్ములం అంతా చిన్నపిల్లలమే. ఆనందమే మా ఆస్తి. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చాక అసలు జీవితం మొదలయ్యేది. బట్టలు మార్చుకుని, పుస్తకాలను ఒక మూలకు విసిరేసి బయటకు పరుగులు. మా ఆటలకు ఎలాంటి ఖరీదైన బొమ్మలు అవసరం లేదు. గోలీ ఆటలో ఎంత ఆనందమో.. ఎంత పోటీనో! మట్టిలో చిన్న గుంతలు చేసి, గోలీలు కొట్టుకుంటూ గంటల తరబడి ఆటలు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్నదానికన్నా, ఆటలో ఉండడమే ముఖ్యం. కొన్నిసార్లు రాళ్లే మా బొమ్మలు. రాళ్లతో ఆటలు, రాళ్లతో ఇళ్లు కట్టడం, రాళ్లతో లక్ష్యాన్ని కొట్టడం. ఇసుక, మట్టి, ఇనుప చువ్వ.. ఇలా ప్రతి వస్తువూ మా ఊహలకు రెక్కలు ఇచ్చేవి. మట్టితో బండ్లు, ఇళ్లు, వంటలు.. మా అమ్మలు చేసే పనుల అనుకరిరణలు. మట్టి చేతికి అంటుకున్నా, అది మురికిగా అనిపించేది కాదు.. అది మా బాల్యపు ముద్ర.
సైకిలు కాదు.. సైకిల్‌ టైరు దొరికినా ‘మేమే రాజులం’. దానిని తోసుకుంటూ ప్రతి గల్లీలో పరుగులు. అది ఎక్కడ ఆగుతుందో, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కానీ పడిపోతామనే భయం కూడా లేదు. కిందపడితే గాయాలు అయ్యేవి, రక్తం వచ్చేది, కానీ ఏడిచింది లేదు. ఆసుపత్రులకు పరుగులు తీసింది లేదు. మళ్లీ లేచి ఆట మొదలుపెట్టేవాళ్లం. సిగరెట్‌ ప్యాకెట్లు కూడా మా ఆటల్లో భాగమే. ఖాళీ ప్యాకెట్లను ఏరుకొచ్చి, వాటితో ఆటలు ఆడేవాళ్లం. ఒక్కోసారి అవే కరెన్సీలా మారేవి. ఎవరి దగ్గర ఎక్కువ ప్యాకెట్లు ఉన్నాయో, వాళ్లే ధనవంతులు. ఇవన్నీ ఇప్పుడు గుర్తుచేసుకుంటే నవ్వొస్తుంది. అప్పట్లో మాత్రం అవే మా విలువైన సంపద. గ్రామీణ భారతదేశానికి చెందిన ఎన్నో ఆటలు మా బాల్యాన్ని నింపాయి. కబడ్డీ, కోకో, లంగడి, గిట్టలాట, దాగుడుమూతలు, గిల్లీదండా… ఇలా ఒక్కో ఆటా ఒక్కో ప్రపంచం. సాయంత్రం వేళ సూర్యుడు దిగిపోతున్నా, ఇంకొంచెం సేపు ఆడుకొని వెళదామని మనసు కోరుకునేది. అమ్మ పిలిచే వరకు ఇంటికి వెళ్లాలనే ఆలోచన ఉండేది కాదు. ఆటల మధ్యలో చెట్లు మా ఆశ్రయం. చెట్లెక్కడం ఒక కళ. మామిడి చెట్టు, చింత చెట్టు, రావి చెట్టు.. ఏదైనా సరే. పై నుంచి కిందకు చూస్తే ప్రపంచం చిన్నగా కనిపించేది. ఆ ఎత్తులో నిలబడి, గాలి ముఖాన్ని తాకుతుంటే, నేను ఏదైనా సాధించగలననే భావన. అప్పట్లో తెలియదు గానీ, అదే స్వేచ్ఛ అంటే ఏమిటో. ఆ రోజుల్లో టీవీలు లేవు. మొబైళ్లు, ఇంటర్నెట్‌ అన్న మాటే లేదు. కానీ కథలు ఉన్నాయి. పెద్దలు చెప్పే కథలు. తాతలు చెప్పే పురాణాలు, అమ్మమ్మలు చెప్పే నీతి కథలు. రాత్రి వేళ చీకట్లో, దీపం వెలుగులో ఆ కథలు వింటూ నిద్రపోవడం.. అది ఒక మాయ. ఆ కథలతోనే మా ఊహాశక్తి పెరిగింది. ఇప్పుడు చూస్తే, పిల్లలు చిన్న వయసులోనే పెద్దవాళ్లలా మారిపోతున్నారు. పుస్తకాల బరువు, మార్కుల ఒత్తిడి, పోటీ.. వాళ్ల భుజాలపై మోపబడుతోంది. ఆటకు సమయం లేదు. మట్టితో ఆడే అవకాశం లేదు. స్వేచ్ఛకు స్థలం లేదు. ప్రతిదీ షెడ్యూల్‌, ప్రతిదీ లక్ష్యం. బాల్యం ఒక పరుగు పందెంలా… ఖరీదైన జూదంలా మారిపోయింది. అందుకే నాకు అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. మేము అనుభవించిన ఆ బాల్యం ఇప్పుడు ఎందుకు దూరమైంది? సదుపాయాలు పెరిగినా, ఆనందం ఎందుకు తగ్గింది? పిల్లల చేతుల్లో బొమ్మలు పెరిగాయి, కానీ నవ్వులు తగ్గాయి. భద్రత పేరుతో, భవిష్యత్తు పేరుతో, బాల్యాన్ని బందీగా చేసేశాం. ఆ రోజులు మళ్లీ అలాగే పునరావృతమవుతాయన్న అత్యాశ ఏమీ లేదు. కానీ, కొంతైనా తిరిగి రావాలని కోరిక. పిల్లలకు మట్టి తాకే అవకాశం ఇవ్వాలని… ఆటలను తిరిగి వారి జీవితాల్లోకి తీసుకురావాలని.. మార్కులకంటే మనిషిగా పెరగడమే ముఖ్యమని గుర్తుచేయాలని ఆశ. బాల్యం ఒక పరీక్ష కాదు. అది ఒక ప్రయాణం. ‘ఆనందం కోసం ఎక్కువ వనరులు అవసరం లేదు. స్వేచ్ఛ ఉంటే చాలు’ అని నా బాల్యం నాకు పాఠం నేర్పింది. ఆ స్వేచ్ఛను కాపాడగలిగితే, భవిష్యత్తు తరాలు కూడా ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుని, మా బాల్యం ఒక కల అని చెప్పగలుగుతాయి. నేను ఆశతోనే జీవిస్తున్నాను..ఆ కల మళ్లీ నిజమవుతుందని.

Please share
Exit mobile version