హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వేళ.. కొందరి అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సాధారణంగా బ్యాండ్ మేళాలకు యువతీ, యువకులు, చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. అయితే ఈసారి కొందరు కళాకారులను ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రదర్శనలు చేయించడం వివాదాస్పదంగా మారుతోంది, ఏకంగా కొండచిలువతో డ్యాన్స్ చేయడం పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
కొన్ని డ్యాన్స్ ప్రదర్శనలు అసభ్యకరంగా, హద్దులు దాటేలా ఉండటంతో నిమజ్జనోత్సవాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో ఘటన తీవ్ర కలకలం రేపింది. విశాఖపట్నానికి చెందిన ఓ డ్యాన్స్ గ్రూప్ కొండచిలువను తీసుకొచ్చి, దాన్ని మెడలో వేసుకుని డ్యాన్స్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
కొండచిలువతో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో పాటు జంతు ప్రేమికులు కూడా స్పందించారు. వన్యప్రాణిని వినోదం కోసం ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
వైరల్ వీడియో ఆధారంగా స్పందించిన పోలీసులు.. కొండచిలువతో డ్యాన్స్ చేసిన విశాఖపట్నానికి చెందిన డ్యాన్స్ గ్రూప్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మాధాపూర్ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవాల్లో ఇలాంటి వికృత ప్రదర్శనలకు చోటు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జంతువులను వినోద కార్యక్రమాల్లోకి తీసుకురావడం పట్ల జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నిమజ్జన వేడుకల పేరుతో హద్దులు దాటుతున్న ప్రదర్శనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.https://janammata.net/le-chee-ka-raja-ganesh-2026-goshamahal-police-clarity/
జనంమాట – మీ గొంతు మా వేదిక
మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.
వివరాలకు:
E Mail: Satyamediasolutions@gmail.com
Phone Number: 97045 35591
