Janammata.net

‘వాస్తవికత’కు పునాది- జానపద సాహిత్యం

వాస్తవికతను యతాథతంగా ప్రతిబింబించే సాహిత్యానికి ఆదరణ ఎంత వరకూ ఉంటుందనేది కొంత మంది ప్రశ్న. అందుకే, వాస్తవాలకు కొన్ని విశేషణాలు, విశేషాలు, కల్పలను జోడించడమే పాఠకులను ఆకర్షించేడానికి ఉత్తమైన మార్గమన్న నిర్ధారణకు వచ్చారు. ఈ ధోరణే ‘మ్యాజికల్ రియలిజం’గా పేరు పొందింది. అయితే, ఒక నిజానికి, కొన్ని కల్పలను చేర్చి వివరించడం కొత్త ప్రయోగమేమీ కాదు. జానపద సాహిత్యంలో ఈ ధోరణి కనిపిస్తుంది. ఒక రకంగా, మ్యాజికల్ రిజయలిజంగా చెప్పే ప్రక్రియకు జానపద సాహిత్యమే పునాది. అతీంద్రియ లేదా అధివాస్తవిక అంశాలను సహజ జీవిత ప్రవాహంలో కలిపి చూపించే విధానాన్ని జానపదాల్లో కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక రచయితలు జానపద సంప్రదాయాలు, విశ్వాసాలు, మూఢనమ్మకాలు, ఇతిహాసాలు, కథా నిర్మాణాలు వంటి అంశాలను తమ సాహిత్యంలో సహజంగా మిళితం చేస్తూ, వాస్తవికతకు ఒక విస్తృతమైన అర్థాన్ని అందించారు. సాహిత్యంలో జానపద మూలకాల వినియోగం ఉపరితల స్థాయిలో ఒక అలంకార సాధనంగా కనిపించవచ్చు. కొన్నిసార్లు ఇది కేవలం స్థానిక రంగును చేర్చే ఉపాయంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ, లోతుగా పరిశీలించినప్పుడు, జానపద కథలు సమాజపు భావజాలం, విలువలు, గుర్తింపు, సాంస్కృతిక చైతన్యాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో, జానపద మూలకాలను కల్పిత సాహిత్యంలో వినియోగించడం కేవలం శైలీ ప్రయోగం మాత్రమేకాదు. అది ఒక సాంస్కృతిక ప్రతిబింబన. సాహిత్యంలో ప్రదర్శనాత్మకత అనే భావన ఈ చర్చలో కీలక స్థానం పొందుతుంది. పదాలు కేవలం వర్ణనాత్మక పాత్రనే కాకుండా, కార్యాత్మక పాత్రను కూడా పోషిస్తాయని ఈ భావన సూచిస్తుంది. జాన్ ఆస్టిన్ ప్రతిపాదించిన పదాలతో పనులు చేయడం అనే సిద్ధాంతం ప్రకారం, భాష ఒక చర్యగా మారుతుంది. ఈ దృష్టితో చూసినప్పుడు, సాహిత్య రచన ఒక ప్రదర్శనగా, ఒక సామాజిక చర్యగా గోచరిస్తుంది. జానపద కథలు ఈ ప్రదర్శనలో భాగమై, సాంస్కృతిక అనుభవాలను పునర్నిర్మిస్తాయి. జాతిశాస్త్రం, సాహిత్యం మధ్య ఉన్న సంబంధం ఈ సందర్భంలో విశ్లేషణకు ఆహ్వానిస్తుంది. జాతిశాస్త్ర (ఎథ్నోగ్రఫీ) రచన ఒక నిర్దిష్ట సమూహ జీవన విధానాలను, నమ్మకాలను, అనుభవాలను అర్థం చేసుకుని వాటిని పాఠకులకు అందించడానికి ప్రయత్నిస్తుంది. ఇదే విధంగా, కల్పిత సాహిత్యం కూడా ఒక నమ్మదగిన ప్రపంచాన్ని నిర్మించడానికి కృషి చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న సారూప్యతను కమిలా విశ్వేశ్వరన్ స్పష్టంగా సూచించింది. ఆమె అభిప్రాయం ప్రకారం, కల్పన, జాతిశాస్త్రం రెండూ ప్రపంచ నిర్మాణ ప్రక్రియలే. పాఠకుడు వాటిని ఎలా స్వీకరిస్తాడనే దానిలోనే తేడా ఉంటుంది. ఈ నేపథ్యంలో, సాహిత్య విమర్శలో మ్యాజికల్ రియలిజం వంటి పదాల వినియోగంపై పునర్విమర్శ అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పదాలు తరచుగా సాంస్కృతిక అనుభవాల లోతైన అర్థాన్ని సరళీకరించి, ఒకే శ్రేణిలో చేర్చే ప్రమాదం కలిగి ఉంటాయి. జానపద విశ్వాసాలు, ఆచారాలు, కథనాలు ఒక సమాజంలో సహజంగా ఉన్న వాస్తవికతను ప్రతిబింబిస్తే, వాటిని మాయాజాలంగా పిలవడం ఆ సమాజపు దృక్కోణాన్ని వక్రీకరించే అవకాశముంది. పోస్ట్-ఎథ్నోగ్రఫీ అనే భావన ఈ సమస్యకు ప్రతిస్పందనగా ఉద్భవించింది. జాతిశాస్త్ర రచనల పరిమితులను గుర్తించి, కొత్త విధానాలను అన్వేషించాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుంది. అనేక ఎథ్నోగ్రఫీ రచనలు విస్తృత పరిశోధనతో రూపొందించినప్పటికీ, అవి పరిమిత పాఠక వర్గానికే చేరుతున్నాయి. ఫలితంగా, వాటి ద్వారా సేకరించిన జ్ఞానం విస్తృత సమాజానికి అందకుండా మిగిలిపోతుంది. ఈ పరిస్థితిలో, ఆ జ్ఞానాన్ని మరింత సృజనాత్మక, అనువర్తిత రూపాల్లోకి మార్చడం అవసరం. సాంస్కృతిక సామ్రాజ్యవాదం అనే సమస్య కూడా ఈ చర్చలో ప్రధానంగా నిలుస్తుంది. ఒక సమాజానికి చెందిన అనుభవాలను మరో సమాజానికి చెందిన రచయితలు పునర్నిర్మించే సమయంలో, ఆ అనుభవాల అసలు స్వరూపం మారిపోవచ్చు. కరెన్ మెకార్తీ బ్రౌన్ రచనలపై వచ్చిన విమర్శలు ఈ సమస్యను స్పష్టంగా చూపిస్తాయి. స్థానిక అనుభవాలను సులభమైన కథనాలుగా మార్చడం ద్వారా వాటి సంక్లిష్టతను కోల్పోయే ప్రమాదం ఉంది. జాతిశాస్త్ర రచనల విస్తృత పరిమాణం మరో సమస్యను ఉత్పన్నం చేస్తుంది. అనేక గ్రంథాలు, పరిశోధనలు రూపొందించినప్పటికీ, వాటిని నిజంగా ఎంతవరకు చదువుతున్నారు? అనే ప్రశ్న తలెత్తుతుంది. లైబ్రరీలలో నిల్వచేసిన ఈ గ్రంథాలు, కాలక్రమేణా ఉపయోగం కోల్పోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో, జాతిశాస్త్ర జ్ఞానాన్ని విస్తృతంగా పంచుకునే కొత్త మార్గాలను అన్వేషించడం అవసరం. జానపద కథలు, సాహిత్యం మధ్య ఉన్న సంబంధాన్ని ఈ దృక్కోణంలో పునర్మూల్యాంకనం చేయాలి. జానపద కథలను లేదా సాహిత్యాన్ని గతానికి చెందిన అవశేషాలుగా పేర్కోవడం అసమంజసం. అవి ప్రస్తుత జీవితంలో కూడా సజీవంగానే ఉన్నాయి. ప్రజలు తమ అనుభవాలకు అర్థం ఇచ్చే విధానంలో అవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అంశాన్ని గుర్తించినప్పుడు, సాహిత్య రచయితలు జానపద మూలకాలను ఎలా వినియోగిస్తున్నారో లోతుగా అర్థం చేసుకోవచ్చు. సమకాలీన సాహిత్యంలో జానపద మూలకాల వినియోగం విస్తృతంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిని సరైన దృక్కోణంలో విశ్లేషించడం అత్యవసరం. విమర్శకులు తరచుగా సులభమైన వర్గీకరణలకు లోబడి, ఈ సంక్లిష్ట ప్రక్రియలను సరళీకరించే ప్రమాదంలో పడతారు. దీనికి బదులుగా, సాంస్కృతిక సందర్భాలను, స్థానిక విశ్వాసాలను, సామాజిక అనుభవాలను సమగ్రంగా పరిగణించాలి. మొత్తంగా పరిశీలించినప్పుడు, రియలిజం, మాజికల్ రియలిజం, జానపద సాహిత్యం, జాతిశాస్త్రం మధ్య ఉన్న సంబంధం సాహిత్య అధ్యయనంలో ఒక విస్తృతమైన పరిశోధనా రంగాన్ని సూచిస్తుంది. ఈ రంగంలో మరింత లోతైన విశ్లేషణ అవసరం. సాహిత్యం కేవలం వినోద సాధనం కాకుండా, సాంస్కృతిక అవగాహనకు ఒక సాధనంగా కూడా పనిచేస్తుందని గుర్తించడం ఈ అధ్యయనానికి పునాది.
జనపదాల నుంచి….
జానపద సంప్రదాయాలు, ప్రదర్శన అనే భావనతో సమకాలీన సాహిత్య సృజనకు ఉన్న సంబంధం అనేది ఆధునిక సాహిత్య అధ్యయనాలలో అత్యంత సంక్లిష్టమైనదిగా నిలుస్తుంది. ఎందుకంటే, ఇందుకు విస్తృతమైన పరిశీలన అవసరమవుతుంది. ఈ అంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే, మౌఖిక సంస్కృతి నుండి లిఖిత సంస్కృతికి మార్పు, విశ్వాస వ్యవస్థల పరిణామం, సాహిత్య విమర్శలో ఏర్పడిన కొత్త పరిభాషల నేపథ్యం వంటి అనేక అంశాలను సమన్వయంగా పరిశీలించక తప్పదు. ఇంతకు ముందే చెపుకున్నట్టు, జానపదం అనేది కేవలం కథల సమాహారం కాదు. అది ఒక సమాజ అనుభవం, విశ్వాసం, భయం, ఆశ, సంస్కృతికి ప్రతిబింబం. ఈ కథలు మౌఖికంగా ఒకతరం నుంచి మరోతరానికి అందుతూ, ప్రతి సందర్భంలో కొత్త అర్థాలను, కొత్త రూపాలను సంతరించుకుంటాయి. ఈ ప్రక్రియలో ప్రదర్శన అనే భావన కీలక పాత్ర పోషిస్తుంది. జానపద కథలు ఒక స్థిరమైన పాఠ్యంగా కాకుండా, ఒక సంఘటనగా, ఒక చర్యగా, ఒక సామూహిక అనుభవంగా అర్థం చేసుకోవాలి. నిజానికి, ప్రదర్శన అనే భావనను సామాజిక భాషాశాస్త్రం, జానపద అధ్యయనాలు కలిసి విస్తరించాయి. ఇందులో ముఖ్యంగా డెల్ హైమ్స్, జాన్ గంపెరట్జ్ చేసిన పరిశోధనలు, అలాగే రిచర్డ్ బామన్ రచనలు కీలక మలుపు తీసుకువచ్చాయి. బామన్ అభిప్రాయం ప్రకారం, జానపద కథ ఒక ప్రదర్శనగా అర్థం చేసుకోవాలి. అంటే ఒక సందర్భంలో, ఒక ప్రేక్షక సమూహం ముందు, ఒక నిర్దిష్ట ఉద్దేశంతో ప్రదర్శిస్తారు. అయితే, బామన్ చెప్పిన ప్రదర్శన అనేది నాటకరంగ ప్రదర్శనతో సమానం కాదు. ఇది సామాజిక పరస్పర చర్యలో భాగంగా జరిగే సాంస్కృతిక వ్యక్తీకరణ. ఈ దృష్టిలో, కథ చెప్పేవాడు, వినేవాడి మధ్య ఒక జీవంతమైన సంబంధం ఉంటుంది. కథ చెప్పడం అనేది కేవలం సమాచార ప్రసారంగా కాకుండా, ఒక సామాజిక చర్యగా మారుతుంది. ఈ భావన ఆధారంగా, జానపద అధ్యయనాలు ఒక కొత్త దిశలో పయనించాయి. జానపద కథలను వాటి సహజ సందర్భంలో పరిశీలించడం, వాటి ప్రదర్శన లక్షణాలను విశ్లేషించడం, వాటి సామాజిక అర్థాలను అన్వేషించడం అనే మార్గంలో పరిశోధనలు సాగాయి. ఈ విధానం జానపదాన్ని ఒక స్థిరమైన పాఠ్యంగా కాకుండా, ఒక చలనం ఉన్న ప్రక్రియగా చూడటానికి దోహదపడింది.
మౌఖిక ప్రదర్శనల నుండి లిఖిత సాహిత్యానికి మారినప్పుడు, జానపద కథల స్వభావంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పుస్తకం అనే వేదికపై ప్రదర్శించే జానపద కథలు, తమ మౌఖిక మూలాల నుండి భిన్నమైన లక్షణాలను సంతరించుకుంటాయి. ఈ మార్పును అర్థం చేసుకోవడం సాహిత్య విశ్లేషణలో ఒక ముఖ్యమైన సవాలు. సాహిత్యంలో జానపద కథలను ఉపయోగించే రచయితలు, వాటిని కేవలం పునరుత్పత్తి చేయడంతో సరిపుచ్చుకోరు. వాటిని పునర్ చేస్తారు. ఈ ప్రక్రియలో, కథల నిర్మాణం, పాత్రల స్వభావం, విశ్వాసాల ప్రతిపాదన కొత్త అర్థాలను సంతరించుకుంటాయి. ఈ దృష్టిలో, సాహిత్యం ఒక ప్రదర్శన వేదికగా పనిచేస్తుంది. కానీ మౌఖిక ప్రదర్శనతో పోలిస్తే అది మరింత సంక్లిష్టమైనది. ఈ సమయంలోనే, సాహిత్యంలో జానపద ప్రదర్శనను ఎలా గుర్తించాలి? జానపద శాస్త్రవేత్తలు మాత్రమే గుర్తించగల లక్షణాలు ఏమిటి? అనే ప్రశ్నలు తెరపైకి వస్తాయి. వీటికి సమాధానం కనుగొనడానికి అంతర్ దృష్టి అవసరం. సాహిత్యం, జానపదం, సంస్కృతి అధ్యయనాలు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే ఈ సమస్యకు సమగ్ర పరిష్కారం లభిస్తుంది. సమకాలీన రచయితలు తమ రచనల్లో జానపద అంశాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎమీ టాన్, మాక్సిన్ హాంగ్ కింగ్ టోనీ మోరిసన్, లీ స్మిత్ వంటి రచయితలు తమ సాహిత్యంలో జానపద సంప్రదాయాలను సమగ్రంగా అల్లుకున్నారు. అయితే, ఈ రచనలను అర్థం చేసుకోవడానికి పాఠకులు అవసరమైన సాంస్కృతిక పరిజ్ఞానం లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ఇక్కడ ఒక కీలకమైన సమస్య కనిపిస్తుంది. రచయితలు తమ సంస్కృతిని ప్రతిబింబించే కథలను రాస్తారు, కానీ పాఠకులు వాటిని అర్థం చేసుకోవడానికి అవసరమైన నేపథ్యాన్ని కలిగి ఉండరు. ఈ విరుద్ధత సాహిత్య అనుభవాన్ని పరిమితం చేస్తుంది. రచయితలు తమ కథలను అక్కడ ఉంచుతారు. వాటిని గ్రహించడం పాఠకుడి బాధ్యతగా మారుతుంది.


వారసత్వ సంపద..
సాహితీ వారసత్వ సంపదగా మౌఖిక సాహిత్యాన్ని పేర్కోవాలి. ఇది జానపద జీవన విధానంలో అత్యంత ప్రాచీనమైన, సజీవమైన వ్యక్తీకరణ రూపం.  రాతరూపం కంటే ముందుగానే ఉద్భవించి, తరతరాలుగా మాటల ద్వారా, గానాల ద్వారా, ధ్వనుల ద్వారా సంక్రమిస్తూ వచ్చిన సాంస్కృతిక సంపద. శాబ్దిక కళగా పేర్కొనే ఈ రూపం, భావాలను నేరుగా, సహజంగా, సామూహిక అనుభవంతో అనుసంధానించి వ్యక్తపరచగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ‘భావాభివ్యక్తి సాహిత్యం’గా దీన్ని నిర్వచించడం కూడా సముచితమే, ఎందుకంటే ఇందులోని ప్రతి రూపం ప్రజల భావోద్వేగాల స్రవంతిని ప్రతిబింబిస్తుంది. ఒక వ్యక్తి సృష్టించిన కృతి కంటే, సమాజం మొత్తంగా అనుభవించి, మార్పులు చేర్పులు చేసి, నిలబెట్టుకున్న సాహిత్యంగా ఇది నిలుస్తుంది. మౌఖిక సాహిత్యంలో కథా గాథనం ఒక ప్రధాన ఉపవిభాగంగా గుర్తింపు పొందింది. ఈ కథలు వినోదం కోసం మాత్రమే ఉనికిలోకి రాలేదు.. అవి జీవన విధానానికి మార్గదర్శకాలు, విలువల బోధనకు సాధనాలు, అనుభవాల సంకలనాలు. ఆలోచనా విధానాన్ని, జీవన దృష్టిని ప్రతిబింబించే సాధనాలు. పొడుపు కథలు మేధస్సును పదును పెట్టే ప్రహేళికలు. మౌఖిక సాహిత్యం శిష్ట సాహిత్యానికి ఒక ప్రధాన ఆధారం. అనేక మంది రచయితలు తమతమ రచనలకు జానపద సంపద నుండి ప్రేరణ పొందారు. ఇప్పటికీ ప్రేరణ పొందుతునే ఉన్నారు. కథల నిర్మాణం, పాత్రల స్వభావం, భావోద్వేగాల వ్యక్తీకరణ వంటి అంశాలు మౌఖిక సంప్రదాయాల ప్రభావంతో రూపుదిద్దుకున్నాయి. ఈ విధంగా, మౌఖిక సాహిత్యం, లిఖిత సాహిత్యం మధ్య ఒక అంతర్భావ సంబంధం ఏర్పడింది.
మౌఖిక సాహిత్యంలో వినడం, గుర్తుంచుకోవడం ప్రధానమైనా, వస్తు సంస్కృతిలో చూడడం, చేయడం, అనుసరించడం ప్రధానమైనవి. ఒక వృత్తి నేర్చుకోవడం అంటే కేవలం సిద్ధాంత జ్ఞానం కాదని, అది అనుభవంతో కూడిన అభ్యాసమని గుర్తుంచుకోవాలి. ఒక శిల్పి తన పనిని ఎలా చేస్తాడో చూసి, అనుకరించి నేర్చుకోవడం ఈ ప్రక్రియలో ముఖ్యమైనది. ఈ విధంగా, వస్తు సంస్కృతి అనుభవాధారిత జ్ఞానాన్ని సంక్రమిస్తుంది. నైపుణ్యం, సామర్థ్యం ఈ విభాగంలో కీలకమైన అంశాలు. ఒక సమాజం ఉపయోగించే పరికరాలు, వాటిని తయారు చేసే విధానం, వాటి వినియోగం అన్నీ కలిపి ఒక సాంకేతిక జ్ఞాన వ్యవస్థను సూచిస్తాయి. ఈ జ్ఞానం పుస్తకాల ద్వారా కాకుండా, ప్రత్యక్ష అనుభవం ద్వారా సంక్రమిస్తుంది. ఈ విధంగా, వస్తు సంస్కృతి ఒక జీవన నైపుణ్యాల సమాహారం. జానపద వైద్యం కూడా వస్తు సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా నిలుస్తుంది. మౌఖిక సాహిత్యం, వస్తు సంస్కృతి రెండూ పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఒక కథలో వివరించే పరికరాలు, ఒక గేయంలో పేర్కొనే వృత్తులు, ఒక సామెతలో కనిపించే అనుభవాలు వంటివన్నీ వస్తు సంస్కృతితో సంబంధం కలిగి ఉంటాయి. అదే విధంగా, వస్తు సంస్కృతిలో కనిపించే ప్రతి అంశం వెనుక ఒక కథ, ఒక విశ్వాసం, ఒక అనుభవం దాగి ఉంటుంది. ఈ పరస్పర సంబంధం జానపద విజ్ఞానాన్ని ఒక సమగ్ర వ్యవస్థగా నిలబెడుతుంది. మొత్తంగా పరిశీలించినప్పుడు, మౌఖిక సాహిత్యం, వస్తు సంస్కృతి రెండూ జానపద జీవన విధానానికి రెండు పార్శ్వాలుగా దర్శనమిస్తాయి. ఒకటి భావాలను, అనుభవాలను వ్యక్తపరుస్తే, మరొకటి వాటిని భౌతిక రూపంలో ప్రతిబింబిస్తుంది. ఈ రెండూ కలిసి ఒక సమాజ సంపూర్ణ సాంస్కృతిక చిత్రాన్ని నిర్మిస్తాయి.

Please share
Exit mobile version