దేశవ్యాప్తంగా సంచలనం గా మారి గురుగ్రామ్ మహిళా బైకర్ కేసును పోలీసులు చేధించారు, ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టిన కేసులో నిందితుడు కల్యాణ్ బైన్స్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 13న గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. మహిళా బైకర్ సియాను కారు వెంబడించి ఢీకొట్టిన దృశ్యాలు ఆమె బైక్‌కు అమర్చిన కెమెరాలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పోలీసుల వివరాల ప్రకారం, తొలుత నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ప్రాణాలకు ప్రమాదం కలిగించడం వంటి ఆరోపణలతో కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 కింద హత్యాయత్నం అభియోగాన్ని కూడా చేర్చారు. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నిందితుడు కల్యాణ్ బైన్స్లా పాల్వాల్‌కు చెందిన జిమ్ నిర్వాహకుడు, మాజీ కబడ్డీ క్రీడాకారుడిగా పోలీసులు గుర్తించారు. ఘటనలో ఉపయోగించిన మారుతి సుజుకి సియాజ్ కారు ఆర్మీకి చెందిన వ్యక్తి పేరుపై నమోదై ఉండగా, అతని స్నేహితుడైన కల్యాణ్ ఆ కారును తీసుకుని వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను కల్యాణ్ ఖండిస్తూ ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఢీకొట్టడం కాదని, ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పాడు. మరోవైపు బాధితురాలు మాత్రం కారు తనను వెంబడించి కావాలనే ఢీకొట్టిందని ఆరోపించింది. ఒక వేళ ప్రమాదమే అయితే కారును ఎందుకు ఆపలేదని ఆమె ప్రశ్నిస్తోంది.పోలీసులు ప్రస్తుతం వీడియోలు, సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.గురుగ్రామ్ మహిళా బైకర్ కేసు దేశ వ్యాప్తంగా సంచనలంగా మారడంతో పోలీసులు సూమోటో గా కేసును నమోదు చేశారు. https://janammata.net/aga-khan-hyderabad/
