Janammata.net

ఆశగా.. ఆర్తిగా..

నా పేరు..అమ్మా నాన్నా ఎంతో ఇష్టంగా పెట్టుకున్న పేరు… ముద్దుగా పిలిచిన పేరు. ఇప్పుడు ఎవరికీ పట్టని పేరు.. అందుకే ప్రత్యేకించి పేరు చెప్పడం లేదు. నేను ఓ అనామాకుడిని. నిజానికి, ఆ రోజులు ఎంత బాగుండేవి.. నేను పుట్టిన ఊరు ఒకప్పుడు ఆకుపచ్చగా ఉండేది. మా ఊరి అంచున చిన్న నది ప్రవహించేది. ఉదయం సూర్యుడు ఎగసే సమయానికి ఆ నది మీద పశువులు నీరు తాగుతూ కనిపించేవి. మా అమ్మ చేతుల నుంచి ఉడికిన జొన్నల వాసన గాలిలో కలిసేది. కానీ ఇప్పుడు, ఆ నది ఒక పాత జ్ఞాపకం. నేల పగిలిపోయి, ఆ పగుళ్లలోనే మా భవిష్యత్తు మునిగిపోయింది. మా ఊర్లో ఆకలి కొత్త కాదు. కానీ ఈసారి అది మరింత భయంకరంగా వచ్చింది. వర్షాలు రావాల్సిన కాలంలో ఆకాశం రాతిలా మూగబోయింది. నెలలు గడిచాయి, ఏడాది దాటింది. చివరికి పశువులు ఒక్కొక్కటిగా కూలిపోతూ చనిపోయాయి. మా కుటుంబానికి ఉన్న ఆస్తి అంతా అవే. ఒక ఆవు పడిపోయిన రోజు మా నాన్న కన్నీళ్లు తుడుచుకోలేదు. ఆయన నిశ్శబ్దమే నాకు భయంగా అనిపించింది. వర్షం రాకపోయినా… ఆకలి రోజూ వచ్చి పలకరిస్తుంది. బాధిస్తుంది. ఎట్టకేలకు వర్షం వచ్చింది. కానీ, సమస్యలు తీరలేదు. ఒకసారి ఒక్కసారిగా ముంచెత్తిన ఆకస్మిక వరద మా మిగిలిన పొలాన్ని బురద మేటతో నింపేసింది.

ఎండతో అల్లాడిన నేల, వరదల్లో చిక్కుకొని, కొని ఊపిరితో నిలిచింది. ఇది ప్రకృతి కోపమా, లేక మమ్మల్ని ఎన్నడూ పరచిపోయిన పాలకుల శాపమా? ఈ ప్రశ్నలు నాలో సుడులు తిరుగుతూనే ఉన్నాయి. ‘ఈరోజు పిల్లలకి ఏదైనా దొరుకుతుందా?’ అనే మాట ఒక్కటే మా అమ్మ నోటి వెంటనే ప్రతి రోజూ ఉదయం వినిపించేది. పిల్లలను పెంచలేక అల్లాడుతుంటే, తాత మరింత భారమయ్యాడు. అప్పటికే అతని కాళ్లూ చేతులు సన్నబడిపోయాయి. అతడి కళ్ళు పెద్దగా కనిపిస్తాయి. కానీ ఆ కళ్ళలో శక్తి లేదు. ఆకలి మా తాత శరీరాన్ని మాత్రమే కాదు, నవ్వును కూడా తినేస్తున్నది. ఒకప్పుడు దర్జాగా తిరిగిన తాత ఇప్పుడు మట్టిలో కూర్చుని ఖాళీగా ఆకాశాన్ని చూస్తుంటాడు. తనలో తాను గొణుక్కుంటూ పిచ్చిమాటలు మాట్లాడుకుంటాడు. నిన్నటి రోజును తలచుకుంటున్నాడనీ, తాము ఏ విధంగా దోపిడికి గురయ్యామో గుర్తు చేసుకుంటున్నాడనీ మాకు తెలియదు. నాన్న తాతను వదులుకోలేదు. కానీ, పోషించే స్థోమత లేదు. అంతటా అంతులేని శూన్యం. ఆహారం ధరలు పెరిగిపోయాయి. పట్టణానికి వెళ్లినా కొనగలిగే శక్తి మాకు లేదు. అశాంతి, ఘర్షణలు అన్ని దారులనూ మూసేశాయి. మా సొంత గడ్డపైనే శరణార్థులుగా మారిపోయాం.

కొన్నిచోట్ల సహాయం చేరకుండానే ఆగిపోతుంది. కొన్నిచోట్ల సహాయం వచ్చినా, అది అందరికీ సరిపోదు. ఒక గిన్నె అన్నం కోసం వందల మంది క్యూలో నిలబడిన దృశ్యం ఇప్పుడు సాధారణమైంది. సహయం చేయలేని…. ఉద్యోగం ఇవ్వలేని… ఉపాధి చూపలేని… ప్రభుత్వం సహాయ శిబిరాలు పెట్టి, మమ్మల్ని శాశ్వత బిచ్చగాళ్లుగా మార్చింది. ‘ఇక్కడ ఉంటే చనిపోతాం. ఆ సహాయక శిబిరానికి వెళ్దాం’ అంటూ అసహాయ మాటలు. మా ఊరు, మా ఇల్లు, మా జ్ఞాపకాలు అన్నీ ఒక్కసారిగా భారమయ్యాయి. ఆకలితో చనిపోవడం కన్నా, తెలియని దారిలో నడవడం మంచిదన్న వాదనే గెలిచింది. మేము కాలినడకన ప్రయాణం మొదలుపెట్టాం. ఎండ మండిపోతుంది. నీరు బంగారమైంది. దారి మధ్యలో తాత కూలిపోయాడు. అతడిని మోసుకెళ్లే శక్తి ఎవరికీ లేదు. ‘ఇక్కడితోనే నా ప్రయాణం ముగిసిందా?’ అనే ప్రశ్న అతడి కళ్ళలో కనిపించింది. కానీ, సమాధానం ఎవరికీ తెలియలేదు. ఆకలి మనుషులను కఠినంగా చేస్తుంది. మనల్ని మనుషులుగానే ఉండనివ్వదు. శిబిరానికి చేరుకున్నప్పుడు, అది ఒక నగరంలా కనిపించింది. కానీ అది ఆశల నగరం కాదు, ఆకలి నగరం. గుడారాలు, మట్టితో కట్టిన తాత్కాలిక ఇళ్లు, పిల్లల ఏడుపులు, అనారోగ్యుల కేకలు… ఇవన్నీ కలిసిన ఒక వింత శబ్దం అక్కడ ప్రతిధ్వనిస్తున్నది. అక్కడ, నీటి కోసం ఎదురు చూడటం.

ఆహారం కోసం ఎదురు చూడటం. వైద్య సహాయం కోసం ఎదురు చూడటం…. జీవితం అంటేనే ఎదురుచూడడంగా మారింది. మాతో వచ్చిన ఎంతో మంది పిల్లలు కొన ఊపిరితొ కొట్టుకుంటున్నట్టు కనిపించింది. ఓ నర్సు పరీక్షించింది.. ‘తీవ్రమైన పోషకాహార లోపం’ అని నిర్ధారించింది. తినడానికి ఏమీ లేకపోతే… పోషకాహారం ఎక్కడి నుంచి వస్తుందో? అన్నార్తులు ఆర్తనాదాలు చేసే శిబిరంలో వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. మురికి నీరు, జనసాంద్రత, బలహీనమైన శరీరాలు… అన్నీ కలిసికట్టుగా జబ్బులను ఆహ్వానిస్తాయి. ఒకరోజు నా స్నేహితుడు హసన్‌ జ్వరం వచ్చి పడిపోయాడు. రెండు రోజుల్లోనే అతడు లేడు. మేము అతడిని మౌనంగా వీడ్కోలు పలికాం. ఇక్కడ మరణం కూడా సాధారణమైపోయింది. నిన్న మొన్నటి వరకూ ‘ఈ రోజైనా పిల్లలకు తినడానికి ఏమైనా దొరుకుతుందా’ అని బాధపడే అమ్మకు ఇప్పుడు ‘ పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవుతారా?’ అనే అనుమానం వచ్చింది. చాలా మంది పిల్లలు ఐదేళ్లు నిండకముందే చనిపోవడాన్ని చూసి భయపడిపోతున్నది. ఆకలి ఇక్కడ ఉన్న వారి శరీరాలను నెమ్మదిగా కరిగిస్తుంది. చదువు ఒక కల… పాఠశాలలు మూతపడ్డాయి. ఉపాధ్యాయులకు జీతాలు లేవు. పిల్లల చేతుల్లో పుస్తకాల స్థానంలో ఖాళీ గిన్నెలు ఉన్నాయి. రాత్రి పడుకున్నప్పుడు, ఎండిపోయిన మా ఊరు నాకు కలలో కనిపిస్తుంది. ఆ నది మళ్లీ ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మేల్కొనగానే గుడారం పైకప్పు, దోమల శబ్దం, ఆకలి నొప్పి… ఇవే నిజం. నేను ఆలోచిస్తాను, నా జాతి ఎందుకు ఎప్పుడూ ఆకలితోనే ఉంటుంది? ఎందుకు వర్షాలు మమ్మల్ని మోసం చేస్తాయి? ఎందుకు ప్రపంచం మమ్మల్ని చివరి వరుసలో ఉంచుతుంది? కొన్ని రోజులు సహాయం వస్తుంది. బియ్యం సంచులు, నూనె, పప్పులు. ఆ రోజు శిబిరంలో ఒక చిన్న పండుగ వాతావరణం ఉంటుంది. పిల్లలు నవ్వుతారు. కానీ ఆ సంచులు ఖాళీ అయిన తర్వాత మళ్లీ అదే నిశ్శబ్దం. ఆకలి ఒక అలలా వస్తుంది, వెళ్తుంది, మళ్లీ వస్తుంది… కానీ పూర్తిగా ఎప్పుడూ వెళ్లదు. మా నాన్న ఒకప్పుడు రైతు. ఇప్పుడు ఆయన చేతుల్లో పనిలేదు. ఉపాధి లేకపోవడం మనిషిని లోపల నుంచి ఖాళీ చేస్తుంది. నేను నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను, అని ఆయన ఒక రోజు నాతో అన్నారు.

ఆ మాటల్లో ఉన్న బాధను నేను మోయలేకపోయాను. ఆకలి ముందు ఎంతటి వాళ్లయినా లొంగిపోవాల్సిందే. అందుకేనేమో, ఇక్కడి యువకులు కొందరు ప్రమాదకర మార్గాలను ఎంచుకుంటున్నారు. కొందరు నగరాలకు వెళ్తున్నారు, కొందరు సముద్రం దాటాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు ఆయుధాలు పట్టుకుంటున్నారు. ఆకలి మనుషులను తప్పు దారుల్లోకి నెట్టేస్తుంది. అది కేవలం కడుపునే కాదు, సమాజాన్నే కరుస్తుంది. అయినా, ఆశ పూర్తిగా చనిపోలేదు. ఒకరోజు ఒక స్వచ్ఛంద కార్యకర్త మా గుడారం దగ్గరకు వచ్చాడు. మీ పిల్లలు చదువుకోవాలి, అన్నాడు. అతడు ఒక చిన్న తరగతి ప్రారంభించాడు. మట్టిపై కూర్చుని, పలకల మీద అక్షరాలు రాయడం మొదలుపెట్టాం. ఆ క్షణంలో నాకు అనిపించింది ‘ఆకలికి ఎదురుగా నిలబడే శక్తి జ్ఞానం ఒక్కటే’ అని. ఈ ఆలోచన నాకు నవ్వును గుర్తుచేసింది. నా ఊరు… నా ప్రాంతం… ఇప్పటికీ ఆకలితో బాధపడుతోంది. వాతావరణ మార్పులు, యుద్ధాలు, పేదరికం… అన్నీ కలిసి కుదిపేస్తున్నాయి. కానీ ప్రతి శిబిరంలో, ప్రతి గుడారంలో, ఇంకా బతకాలని కోరుకునే హృదయాలు ఉన్నాయి. ఇది నా కథ మాత్రమే కాదు. ఇది లక్షలాది మంది బతకలేని అణగారిన వర్గాల కథ. ఆకలి మమ్మల్ని వంచించినా, మేము పూర్తిగా ఓడిపోలేదు. ఎండిపోయిన నేలలో కూడా ఒక రోజు విత్తనం మొలుస్తుందని, ఆ రోజు కోసం మేము ఎదురుచూస్తూనే ఉన్నాం. ఆశగా.. ఆర్తిగా..

Please share
Exit mobile version