Janammata.net

ఆమె..న్యాయాన్ని అందించింది..

AI Photo

ఆ దృశ్యం సినిమాలోది కాదు. కానీ సినిమా కంటే భయంకరంగా నిజమైనది. ఆ రోజు పోలీస్‌ స్టేషన్‌లో నిశ్శబ్దం అసహజంగా గట్టిగా ఉంది. ఫ్యాన్‌ తిరుగుతున్న శబ్దం కూడా ఒక తీర్పులా వినిపిస్తోంది. టేబుల్‌ మీదున్న ఫైల్‌ తెరిచి చూసిన పోలీస్‌ అధికారి ఒక్క క్షణం కళ్లుమూసుకుంది. లోపలున్నది ఒక కేసు కాదు.. ఒక జీవితానికి జరిగిన అన్యాయం. ఒక జీవితాన్ని దోపిడి చేసిన వైనం. బాధితురాలు పదమూడు ఏళ్ల బాలిక. నేరం చేసిన వాడు దేశం దాటి పారిపోయాడు. చాలామందికి అక్కడే కథ ముగిసింది. ‘ఇక ఏం చేయగలం? అతను విదేశాల్లో ఉన్నాడు. ఇంటర్నేషనల్‌ కేసులు క్లిష్టం నేరస్థుడిని ఇక్కడికి తీసుకురావడం దాదాపు అసాధ్యం’ అంటూ వ్యాఖ్యలు. ఈ మాటలు స్టేషన్‌లోనే కాదు, వ్యవస్థలోనూ వినిపించాయి. కానీ, కేరళకు చెందిన ఆ పోలీస్‌ అధికారిణి, మహిళా ఐపిఎస్‌ మరిన్‌ జోసెఫ్‌ మాత్రం ఆ మాటలు పట్టించుకోలేదు.
నేరం చేసినవాడికి భౌగోళిక సరిహద్దులు రక్షణ కావు…. చట్టానికి మ్యాప్‌ ఉండదు…. న్యాయానికి వీసా అవసరం లేదు…. అంటూ గట్టిగా నమ్మింది. ఈ కేసు తన దృష్టికి వచ్చిన నాటి నుంచి ఆమెకు దీనిని పరిష్కరించి తీరాలని, లేకపోతే దోషులు ఇదే విధంగా చట్టంతో ఆటలాడుకుంటునే ఉంటారనీ పట్టుదలతో లోతుగా అధ్యయనం మొదలు పెట్టింది. కేసులోని ప్రతి విషయాన్నీ… ప్రతి అంశాన్నీ ఒక ఆయుధంగా మలచుకుంది. పాస్‌పోర్ట్‌ రికార్డులు.. ఫ్లుటై లాగ్స్‌… కాల్‌ డాటా, బ్యాంక్‌ లావాదేవీలు.. ఇలా, ఏ ఒక్క విషయాన్నీ విడిచిపెట్టకుండా క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రతి చిన్న ఆధారాన్నీ నేరగాడిని పట్టుకోవడానికి సిద్ధం చేసుకుంటున్న గొలుసులో ఒక భాగంగా చేర్చుకుంటూ వెళ్లింది.
మరోవైపు దుబాయ్‌ పారిపోయిన నేరస్థుడు తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో ఉన్నాడు.
‘ఇక్కడ భారతీయ పోలీస్‌ ఏం చేస్తుంది? వాళ్ల చట్టాలు ఇక్కడ పనిచేయవు’ అని నమ్మాడు.
అది అతని మొదటి తప్పు… చివరిది కూడా..
మరిన్‌ ఒక్క ఎక్కడా తొందరపడలేదు. ఒక్క తప్పటడుగు కూడా వేయలేదు. అంతర్జాతీయ చట్టాలు, దౌత్య మార్గాలు, అధికారిక అనుమతులు వంటి అంశాలను పరిశీలించింది. నేరగాన్ని స్వదేశానికి పట్టుకొని రావడానికి అవసరమైన మార్గాలను అన్వేషించింది. ఎందుకంటే ఆమెకు తెలుసు.. చట్టాన్ని ఉల్లంఘించి సాధించినది న్యాయం కాదు. నెలలు గడిచాయి. పైస్థాయిల నుంచి ప్రశ్నలు దాదాపుగా ఆగిపోయాయి. మీడియా ఈ కేసును కొత్తగా దొరికిన సంచలన వార్తలను వండి వడ్డిస్తోంది. సమాజం ఎప్పుడో బాలికపై అత్యాచారం కేసును మరచిపోయింది. కానీ, మరిన్‌ మాత్రం బాధితురాలి ముఖాన్ని మరచిపోలేదు. భయంతో వణికిన ఆ కళ్ళు ప్రతిరోజూ ఆమెను వెంటాడాయి.
ఆమె ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రోజులు చివరికి రానే వచ్చింది.
విదేశీ భూమిపై, చట్టబద్ధమైన ప్రక్రియలో, ఆ నేరస్తుడి ముందు నిలబడింది భారతీయ పోలీస్‌. ఎలాంటి అరుపులు లేవు. ఎలాంటి డ్రామా లేదు. ‘నువ్వు ఎంత దూరం పారిపోయినా, చట్టం నిన్ను వెంబడిస్తుంది’ అనే ఒక్క వాక్యమే అక్కడ అంతర్లీనంగా వినిపించింది.
నేరగాడి ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. అది శిక్షకు సంబంధించినది కాదు… తప్పించుకున్నానని ఇంతకాలం నమ్మిన అహంకారం కూలిపోయిన క్షణం కలిగిన గందరగోళం.. అయోమయం… దిగ్భ్రాంతి… మరిన్‌ అన్ని లాంఛనాలను స్వయంగా పూర్తి చేసుకుంది. దోషిని భారత్‌కు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టింటది. అక్కడ హీరోలు లేరు. నేపథ్య సంగీతం లేదు. ఉన్నది ఒక బాధితురాలు, ఒక న్యాయమూర్తి, ఒక వ్యవస్థ. చివరికి న్యాయం గెలిచింది. తీర్పు వచ్చింది. దోషికి శిక్ష పడింది. అది కేవలం ఒక్క వ్యక్తికి పరిమితంకాదు.. నేరం చేసిన వాడికి.. చేయాలన్న ఆలోచన ఉన్నవాడికి కూడా ఒక స్పష్టమైన సందేశం. చట్టానికి అతీతులమనే భ్రమను తుడిచిపెట్టిన ఒక స్పష్టమైన సందేశం. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. నేరం చేసినవాడికి కొంత సమయం దొరకొచ్చు. కానీ తప్పించుకునే అవకాశం ఉండదు.
కేసు మొదలైనప్పుడు మరిన్‌ ఏ విధంగా మౌనంగా ఆలోచిస్తూ ఉన్నదో… దోషికి శిక్ష పడినప్పుడు కూడా ఆమె అదే మౌనాన్ని ధరించింది. ఆ రోజు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అవార్డులు కోరలేదు. ఆమె తిరిగి స్టేషన్‌కు వచ్చి మరో ఫైల్‌ తెరిచింది. ఆమె దృష్టిలో ఇది తన వ్యక్తిగత విజయం కాదు.. తన బాధ్యత మాత్రమే. కానీ ఆ కథ అక్కడితో ఆగలేదు. ఎక్కడో ఒక చోట, ఇంకొక నేరం చేయాలని ఆలోచిస్తున్న వాడి మనసులో ఈ కేసు ఒక భయంలా నిలిచింది. పారిపోతే సరిపోదు అనే ఆలోచన అతడిని ఆపింది. అదే మరిన్‌ సాధించిన నిజమైన విజయం. చట్టం నెమ్మదిగా నడుస్తుండవచ్చు.. ప్రభుత్వాలు, పాలకులు, రాజకీయంగా, ఆర్థికంగా బలపడిన వారి నుంచి కొంతకాలం రక్షణ లభిస్తుండవచ్చు. కానీ, అది తాత్కాలికమే. చట్టం ఎప్పుడూ ఆగదు. నేరస్థుడు ఎవరైనా కావచ్చ… ఎక్కడైనా దాక్కోవచ్చు. చట్టం ఎప్పుడైనా తలుపు తడుతుంది. న్యాయం ఎన్నటికైనా గెలుస్తుంది. మరిన్‌ లాంటి నిజాయతీపరులైన అధికారులు పుడుతునే ఉంటారు. కర్తవ్యాన్ని నిర్వహిస్తునే ఉంటారు.
(కేరళకు చెందిన 2012 బ్యాచ్‌ ఐపిఎస్‌ అధికారిణి మరిన్‌ జోసెఫ్‌పై సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాలే స్ఫూర్తి)

Please share
Exit mobile version