రాయ్‌పూర్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం (ఐజీకేవీ)లో బీఎస్సీ అగ్రికల్చర్ మరో ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలపై పోలీసు దర్యాప్తు జరపాలని విశ్వవిద్యాలయం కోరింది.
ఇప్పటికే బీఎస్సీ అగ్రికల్చర్‌కు సంబంధించిన రెండు సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలతో వాటి పరీక్షలను రద్దు చేశారు.
తాజా ఘటనలో ఆగస్టు 19న 28 వ్యవసాయ కళాశాలల్లో నిర్వహించిన ఏపిబీ-5121 (ఫండమెంటల్స్ ఆఫ్ జెనెటిక్స్) పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వచ్చాయి.
బుధవారం ఒక జాతీయ హిందీ దినపత్రికలో ఈ విషయంపై కథనం ప్రచురించడంతో ఘటన వెలుగులోకి వచ్చిందని విశ్వవిద్యాలయం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆ పత్రికకు చెందిన ఓ జర్నలిస్టు ప్రశ్నలు, సమాధానాలతో కూడిన పీడీఎఫ్‌ను వాట్సాప్ ద్వారా విశ్వవిద్యాలయ సమాచార, ప్రజా సంబంధాల అధికారికి పంపినట్లు తెలిపింది.
ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు విశ్వవిద్యాలయం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాథమిక విచారణలో భాగంగా కమిటీ ఒక వ్యవసాయ కళాశాలకు పంపిన, అనంతరం విశ్వవిద్యాలయానికి తిరిగి వచ్చిన ప్రశ్నపత్రాల కవర్లను పరిశీలించింది.
ఫండమెంటల్స్ ఆఫ్ జెనెటిక్స్ ప్రశ్నపత్రం ఉన్న కవర్‌తో పాటు మరికొన్ని కవర్లలోనూ చేర్పులు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని విశ్వవిద్యాలయం బుధవారం తెలిపింది. గతంలో పోలీసులు దర్యాప్తు చేసిన ప్రశ్నపత్రం లీక్ కేసులో కనిపించిన ఆనవాళ్లతో ఇవి సారూప్యత కలిగి ఉన్నాయని పేర్కొంది.
వార్తాపత్రిక కథనం, లీక్ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశ్నలు-సమాధానాలతో కూడిన పీడీఎఫ్, అసలు ప్రశ్నపత్రం, విచారణ కమిటీ నివేదిక ప్రతులను తేలిబందా పోలీసులకు విశ్వవిద్యాలయం అందజేసింది.
ఫిర్యాదు అందిందని, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఐజీకేవీ పరీక్షలకు సంబంధించి వరుసగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకుంది.
ఆగస్టు 22న ఐజీకేవీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు కళాశాల ప్రొఫెసర్‌తో పాటు ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
రెండో సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్‌లోని ఎంటమాలజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం ఆగస్టు 20న పరీక్ష ప్రారంభమయ్యే ఉదయం వెలుగులోకి రావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు.
