తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు తొలిరోజే తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ (Assembly) సమావేశాలు ప్రారంభం కాకముందే గేటు వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీ (Telangana Assembly)కి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ పలు కొటేషన్లతో కూడిన టీషర్టులను వారు ధరించారు.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కిందపడిపోయారు. కేటీఆర్, జగదీశ్ రెడ్డి తదితరులకు కూడా స్వల్ప గాయాలైనట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
టీషర్ట్ విప్పేసి అసెంబ్లీలోకి వెళ్లేందుకు హరీశ్ రావు ప్రయత్నం
నల్ల టీషర్టులు ధరించడం అభ్యంతరకరమైతే వాటిని తొలగించి సభలోకి వస్తామని హరీశ్ రావు తెలిపారు. ఈ క్రమంలో తన టీషర్ట్‌ను విప్పేసి బనీన్‌తోనే తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో గేటు వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
మరోవైపు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అడ్డుకున్నారని ఆ పార్టీ ఆరోపించింది. పోలీసులు తోసేయడంతో తనకు గాయాలయ్యాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆమె కంటతడి పెట్టుకున్నారు.
పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) గేటు వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యేలను అడ్డుకోవడమే కాకుండా మహిళా ఎమ్మెల్యేలతో సహా ప్రజాప్రతినిధులను మెడలు పట్టుకుని బయటకు పంపించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో లోపాలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ (Telangana Assembly)లోకి రాకుండా అడ్డుకున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం తమపై ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు.
తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించారని కాంగ్రెస్ ఆరోపించింది.
తాతా మధు వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సహా పలువురు కాంగ్రెస్ సభ్యులు తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో డిమాండ్ చేశారు.
దీంతో సమావేశాల తొలిరోజే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం, నిరసనలు చోటుచేసుకున్నాయి. గేటు వద్ద జరిగిన పరిణామాలు, అనంతరం సభలో తాతా మధు వ్యాఖ్యల వివాదంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా వేడెక్కాయి.
అటు బీజేపీ కూడా విద్యార్థుల ష్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
