Janammata.net

శభాష్ తెలంగాణ పోలీసు

బొల్లారం ఆయుధాల చోరీ కేసు కేవలం ఒక దొంగతనాన్ని ఛేదించిన కేసు కాదు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన కేసు. అలాంటి కేసులో నిందితుడిని గుర్తించడం, చోరీకి గురైన ఆయుధాలను సురక్షితంగా స్వాధీనం చేసుకోవడం తెలంగాణ పోలీసుల దర్యాప్తు నైపుణ్యానికి నిదర్శనం.

క్లూల కోసం వేలాది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. భారీ మొత్తంలో కాల్ డేటాను విశ్లేషిస్తూ.. అనేక మందిని విచారిస్తూ.. పలు దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ చివరకు కేసును కొలిక్కి తీసుకురావడం అభినందనీయం.

దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉన్న ఆయుధాలు సురక్షితంగా తిరిగి లభించడం తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు.. దేశానికే ఊరట.

సికింద్రాబాద్ బొల్లారంలోని 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి అత్యంత కీలకమైన ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రి చోరీకి గురైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ క్యాంపస్‌లోకి చొరబడి ఆయుధాలను ఎత్తుకెళ్లడం భద్రతా వ్యవస్థకే పెద్ద సవాల్‌గా మారింది. అయితే ఈ సంచలన కేసును తెలంగాణ పోలీసులు అత్యంత పకడ్బందీగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో పోలీసు శాఖపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఆయుధాలు సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడమే ఆందోళన కలిగించే విషయం. అలాంటి ప్రమాదానికి తావులేకుండా చోరీకి గురైన ఆయుధాలను గుర్తించి, వాటిని సురక్షితంగా స్వాధీనం చేసుకోవడం ఈ కేసులో అత్యంత కీలకమైన విజయంగా చెప్పుకోవాలి.

‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు’.. కానీ తెలంగాణ పోలీసులు పట్టేశారు!

‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు’ అనే సామెత ఉంది. కానీ ఈ కేసులో తెలంగాణ పోలీసులు ఆ మాటను తలకిందులు చేశారు.

ఆర్మీ వ్యవస్థ గురించి లోతుగా తెలిసిన వ్యక్తి.. భద్రతా ఏర్పాట్లపై అవగాహన ఉన్న వ్యక్తి.. ఆయుధాగారంలోకి వెళ్లి అత్యంత కీలకమైన ఆయుధాలను ఎత్తుకెళ్లాడు. తొలుత ఎలాంటి స్పష్టమైన క్లూ లేకపోయినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, అనుమానితుల కదలికలు, పాత పరిచయాలు ఇలా ప్రతి అంశాన్ని కలిపి చివరకు నిందితుడి వరకు చేరుకున్నారు.

ఇదే తెలంగాణ పోలీసు ల దర్యాప్తు సామర్థ్యానికి నిదర్శనం.

ఆర్మీ భద్రతా వ్యవస్థపై కూడా పాఠం

ఈ ఘటనలో పోలీసుల ప్రతిభను అభినందించాల్సిందే. అదే సమయంలో ఆర్మీ క్యాంపస్‌లో చోటుచేసుకున్న భద్రతా లోపాలపై కూడా లోతైన సమీక్ష అవసరం.

దర్యాప్తులో ఆయుధాగారాన్ని కవర్ చేసే సీసీటీవీ కెమెరాలు రాత్రివేళల్లో ఆఫ్ అవుతున్న అంశం వెలుగులోకి వచ్చినట్లు గతంలో నివేదికలు వచ్చాయి. ఆయుధాగారం వంటి అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఇలాంటి భద్రతా లోపాలు ఉండటం ఆందోళన కలిగించే అంశమే. ఈ వ్యవహారంపై ఆర్మీ స్థాయిలో కూడా విచారణ కొనసాగుతోంది.

భద్రత ఎంత పటిష్టంగా ఉన్నా ‘మన పరిధిలోకి ఎవరూ రారు’ అనే చిన్నపాటి అతి విశ్వాసం, అలక్ష్యం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

ఆయుధాలు సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లకపోవడం అతిపెద్ద ఊరట

ఈ కేసులో అత్యంత ఉపశమనం కలిగించే అంశం ఒక్కటే — చోరీకి గురైన ఆయుధాలు ప్రమాదకరమైన వ్యక్తులు లేదా సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లకముందే వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడం.

చోరీ వెనుక ఉగ్రవాద సంబంధం లేదా ఇతర సంఘవిద్రోహ కోణం ఉందా అనే అంశాన్ని కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలించాయి. ఇప్పటివరకు లభించిన తాజా వివరాల ప్రకారం వ్యక్తిగత అసంతృప్తి, ప్రతీకార భావనే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 

వేలాది ఫుటేజీలు.. భారీగా కాల్ డేటా.. అనేక కోణాల్లో దర్యాప్తు

ఆయుధాల చోరీ బయటపడిన వెంటనే తెలంగాణ పోలీసులు కేసును సాధారణ దొంగతనంగా కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశంగా పరిగణించారు. బొల్లారం పోలీసులు, మల్కాజ్‌గిరి పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT), హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇతర దర్యాప్తు సంస్థలు కూడా వివిధ కోణాల్లో విచారణ చేపట్టాయి.

వేలాది కాల్ డేటా రికార్డులను పరిశీలించడంతో పాటు పెద్ద సంఖ్యలో సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. పలువురు అనుమానితులను ప్రశ్నించారు. ఆయుధాలు ఎక్కడికి తరలించబడ్డాయి? చోరీ వెనుక ఎవరున్నారు? అంతర్గత సహకారం ఉందా? ఉగ్రవాద లేదా సంఘవిద్రోహ శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికారు. 

చివరకు తేలింది ఏంటి?

తాజాగా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ ఆర్మీ హవిల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్‌ను గుర్తించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం జంగం రెడ్డి పల్లికి చెందిన మల్లేష్ 2010లో ఆర్మీలో చేరి సుమారు 16 సంవత్సరాలు సేవలందించాడు. 2026 జూన్ 30న సర్వీసు నుంచి బయటకు వచ్చాడు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఉద్యోగం నుంచి బయటకు రావడం, దానిపై ఏర్పడిన అసంతృప్తి, కోపమే చోరీకి కారణంగా ఉండొచ్చని తెలుస్తోంది. ఆగస్టు 28, 29 తేదీల్లో ఆయుధాగారం వద్ద భద్రతా ఏర్పాట్లు, వెలుతురు, సీసీటీవీ కెమెరాల పరిస్థితిని పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 30-31 మధ్యరాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆయుధాగారంలోకి ప్రవేశించి తాళాలు పగులగొట్టి ఆయుధాలను ఎత్తుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది.https://janammata.net/ganesh-mandapam-free-current/

Please share
Exit mobile version