తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ రకాల దర్శన టికెట్లు, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల విడుదల తేదీలను వెల్లడించింది. నవంబర్ 28న శ్రీవాణి దర్శన టికెట్లు, నవంబర్ 30న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది. అలాగే, డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు ఆన్‌లైన్‌లో ఈ-డిప్ విధానంలో నమోదు చేసుకోవచ్చు.
టికెట్ల విడుదల తేదీలు ఇవే..
వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ ప్రకటించిన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
- నవంబర్ 28: ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.
- నవంబర్ 30: ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు.
- డిసెంబర్ 1 నుంచి 5 వరకు: డిసెంబర్ 20, 21 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాల కోసం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లకు ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 1న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
- డిసెంబర్ 7: మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ విధానంలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను కేటాయించనున్నారు.
- డిసెంబర్ 8: ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నారు.
డిసెంబర్ 20, 21 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఈ రెండు రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.
అంతేకాకుండా, డిసెంబర్ 20, 21 తేదీలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేసింది. ఈ రెండు రోజుల్లో సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయించనున్నారు.
భక్తులు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు
వైకుంఠ ద్వార దర్శనాలకు వెళ్లాలనుకునే భక్తులు టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను ముందుగానే గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా డిసెంబర్ 20, 21 తేదీల్లో దర్శనం చేసుకోవాలనుకునే వారు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువులోగా నమోదు చేసుకోవాలి.
