August 20, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

ఆ నీళ్లు తాగితే అంతే సంగతులు

రైల్వే స్టేషన్ల లో నీళ్లు తాగుతున్నారా… అయితే మీరు రోగాల బారిన పడ్డట్టే…. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందించే తాగునీటి నాణ్యతపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 49 రైల్వే స్టేషన్లలో సేకరించిన నీటి నమూనాలను పరిశీలించగా, 8 స్టేషన్లలోని వాటర్ కూలర్ల నీటిలో ఈ-కోలి (E. coli) బ్యాక్టీరియా ఉన్నట్లు ఆడిట్‌లో వెల్లడైంది.

ఈ స్టేషన్లలో హైదరాబాద్‌తో పాటు కోయంబత్తూరు, పాలక్కాడ్, చెన్నై-ముంబై రైల్వే నెట్‌వర్క్‌లోని కొన్ని ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. ఈ-కోలి ఉనికి సాధారణంగా నీరు మలినాలతో కలుషితమైనట్లు సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

తాగునీటిలో బ్యాక్టీరియా, క్లోరిన్ స్థాయిలను పరీక్షించడంలో కూడా పలు లోపాలను CAG గుర్తించింది. కొన్ని స్టేషన్లలో నిర్దేశిత వ్యవధిలో నీటి పరీక్షలు నిర్వహించలేదని, మరికొన్ని చోట్ల రసాయన పరీక్షలు కూడా సక్రమంగా జరగలేదని నివేదిక పేర్కొంది. నిబంధనల ప్రకారం తాగునీటిని ఏడాదికి కనీసం రెండుసార్లు పరీక్షించాల్సి ఉంటుంది. 

2022-23లో 49 స్టేషన్లు, 2023-24లో మరో 56 స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ ట్యాపుల నీటి నమూనాలను పరిశీలించినప్పుడు కూడా టోటల్ కాలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు.

ప్రయాణికులకు సురక్షితమైన తాగునీరు అందేలా నీటి సరఫరా వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం అన్ని రకాల నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని CAG రైల్వే శాఖకు సూచించింది.

More Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.