November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

విద్యార్థులు టీచర్ల శత్రువులు కాదు

ఏ ఉపాధ్యాయుడూ విద్యార్థులను దండించాలని లేదా వారిని బాధపెట్టాలని కోరుకోరు. కొన్ని సందర్భాల్లో విద్యార్థుల తప్పులను సరిదిద్దేందుకు కఠినంగా మాట్లాడాల్సి వచ్చినా, అది వారి మీద కోపంతోనో, ద్వేషంతోనో కాదు.. వారి మంచి కోసమేనని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రతి చిన్న విషయానికీ పాఠశాలకు వచ్చి తమ పిల్లలను ఏమీ అనవద్దని చెప్పడం, పిల్లలు చేసిన తప్పులను సమర్థిస్తూ వారిని వెనకేసుకురావడం వల్ల తాత్కాలికంగా వారికి సంతోషం కలిగినా, దీర్ఘకాలంలో నష్టపోయేది మాత్రం విద్యార్థులే. పిల్లలు తమ తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం లేకుండా పోతుంది. క్రమశిక్షణ, బాధ్యత, తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించే గుణం వారికి అలవడదు.

ముఖ్యంగా పిల్లల ముందే ఉపాధ్యాయులను తల్లిదండ్రులు దూషించడం లేదా వారి మాటలను తక్కువ చేసి మాట్లాడటం వల్ల విద్యార్థుల్లో టీచర్లపై గౌరవం తగ్గిపోతుంది. ఉపాధ్యాయుడి మాటకు విలువ లేకపోతే, విద్యార్థికి చదువుపై, క్రమశిక్షణపై కూడా సరైన దృష్టి ఉండదు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమ చూపించడం ఎంత ముఖ్యమో, వారి తప్పులను గుర్తించి సరిదిద్దే విషయంలో ఉపాధ్యాయులకు సహకరించడం కూడా అంతే ముఖ్యం.

పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరి పాత్ర ఎంతో కీలకం. పిల్లలు తప్పు చేసినప్పుడు వెంటనే వారిని సమర్థించడం కంటే, అసలు విషయం ఏమిటో తెలుసుకుని తప్పు ఉంటే సరిదిద్దేలా ప్రోత్సహించాలి. అదే సమయంలో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల పట్ల ప్రేమ, ఓర్పు, బాధ్యతతో వ్యవహరించాలి.

తల్లిదండ్రులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి — టీచర్ మీ పిల్లలకు వ్యతిరేకం కాదు, వారి భవిష్యత్తు కోసం పనిచేసే వ్యక్తి. పిల్లలపై ప్రేమ పేరుతో ప్రతి విషయంలో వారిని వెనకేసుకురావడం కంటే, మంచి-చెడు ఏదో అర్థం చేసుకునేలా వారికి మార్గనిర్దేశం చేయడం ఎంతో అవసరం.

పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కాకుండా పరస్పరం గౌరవించుకుంటూ, కలిసి పనిచేయాలి. దయచేసి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి, తమ పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులకు సహకరించాలని కోరుతున్నాను.

— నాగ లక్ష్మీ, టీచర్

Please share