November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

26 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్ లోకి గోల్డ్ స్పాట్ !

Gold Spot orange soft drink comeback in India after 26 years

Gold Spot orange soft drink comeback in India after 26 years

ఒకప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్న ఆరెంజ్ ఫ్లేవర్ కూల్‌డ్రింక్ ‘గోల్డ్ స్పాట్’ (Gold Spot) మళ్లీ భారత మార్కెట్లోకి రాబోతోంది. దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ పాపులర్ డ్రింక్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రముఖ శీతల పానీయాల సంస్థ కోకా-కోలా (Coca-Cola) సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో 90వ దశకంలో గోల్డ్ స్పాట్‌ను ఆస్వాదించిన వారిలో మరోసారి పాత జ్ఞాపకాలు మొదలయ్యాయి.

తక్కువ చక్కెరతో కొత్త రూపంలో గోల్డ్ స్పాట్!

మీడియా కథనాల ప్రకారం.. ఈసారి గోల్డ్ స్పాట్‌ను తక్కువ చక్కెర (Low Sugar) లేదా చక్కెర లేని (No Sugar) వేరియంట్‌లో తీసుకురావాలని కోకా-కోలా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మారుతున్న వినియోగదారుల అభిరుచులు, ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ కొత్త వెర్షన్ త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని, నవంబర్ చివరి వారం లేదా తదుపరి వారం నుంచి అందుబాటులోకి రావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే కంపెనీ నుంచి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

2000లో కనుమరుగు!

ఈ బ్రాండ్ కు భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. పార్లే సంస్థ 1952లో ఈ ఆరెంజ్ ఫ్లేవర్ శీతల పానీయాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రత్యేకమైన రుచి, ఆకర్షణీయమైన ఆరెంజ్ రంగు, ‘ది జింగ్ థింగ్’ (The Zing Thing) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ డ్రింక్ అప్పట్లో ఎంతో ప్రజాదరణ పొందింది.

1993లో పార్లే గ్రూప్‌కు చెందిన శీతల పానీయాల వ్యాపారాన్ని కోకా-కోలా కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా థమ్స్ అప్, లిమ్కా, మాజా వంటి బ్రాండ్లతో పాటు గోల్డ్ స్పాట్ కూడా కోకా-కోలా చేతుల్లోకి వెళ్లింది.

అయితే 2000 సంవత్సరంలో కోకా-కోలా దీని విక్రయాలను నిలిపివేసింది. అదే ఆరెంజ్ ఫ్లేవర్ విభాగంలో ఉన్న తన అంతర్జాతీయ బ్రాండ్ ఫాంటా (Fanta)పై దృష్టి పెట్టడంతో గోల్డ్ స్పాట్ మార్కెట్ నుంచి కనుమరుగైంది.

ధోనీ ఫోటోతో మళ్లీ మొదలైన చర్చ!

గోల్డ్ స్పాట్ రీఎంట్రీ వార్తలకు మరో ఆసక్తికర పరిణామం తోడైంది. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఆయన భార్య సాక్షి ధోనీతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో గోల్డ్ స్పాట్ క్యాన్లు కనిపించడంతో ఈ బ్రాండ్ తిరిగి వస్తోందనే చర్చ మరింత ఊపందుకుంది.

అయితే ధోనీ ఈ బ్రాండ్‌కు అధికారిక ప్రచారకర్తగా వ్యవహరిస్తారా? లేదా? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.

కోకా-కోలా వ్యూహం ఏంటి?

ప్రస్తుతం భారత శీతల పానీయాల మార్కెట్లో పోటీ పెరుగుతోంది. రిలయన్స్‌కు చెందిన క్యాంపా (Campa) వంటి బ్రాండ్లు కూడా మార్కెట్లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ప్రజాదరణ పొందిన గోల్డ్ స్పాట్‌ను తిరిగి తీసుకురావడం ద్వారా వినియోగదారుల్లో ఉన్న పాత అనుబంధాన్ని సొంతం చేసుకోవాలని కోకా-కోలా భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మొత్తానికి 90వ దశకంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడిన గోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకి వస్తుందన్న వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే కొత్త రుచిలో పాత మ్యాజిక్‌ను చూపిస్తుందా? అనేది వేచి చూడాలి.

Please share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *