November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

ఆడుకోను చోటు కావాలి

పిల్లలు ఆడుకోవడానికి సరైన ఆట స్థలాలు కనిపించకపోవడం ఆందోళన కలిగించే విషయం. నగరాలు, పట్టణాలు రోజురోజుకూ విస్తరిస్తున్నా.. పిల్లలు ఆడుకునేందుకు మాత్రం స్థలం కరువవుతోంది. ఖాళీ స్థలాలు కనిపిస్తే వాటిలో కార్లు, ఇతర వాహనాలను పార్కింగ్ చేసి ఉంచుతున్నారు. దీంతో పిల్లలు బయటికి వెళ్లి ఆడుకునే అవకాశం కూడా లేకుండా పోతోంది.

కొన్ని ప్రాంతాల్లో ఒకటి రెండు ప్లే గ్రౌండ్స్ ఉన్నప్పటికీ వాటి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఉన్న ఆట స్థలాలను కూడా కొంతమంది పెద్దలు ఆక్రమించుకుని కూర్చోవడం, కబుర్లు చెప్పుకోవడం, తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవడం వల్ల పిల్లలు అక్కడ ఆడుకునే పరిస్థితి లేకుండా పోతోంది. పిల్లలు ఆట స్థలానికి వస్తే వారినే అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడం బాధాకరం.

ఆట స్థలాలు పెద్దలు కబుర్లు చెప్పుకోవడానికి, వాహనాలు నిలిపేందుకు లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవడానికి కాదు.. పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడానికి, శారీరకంగా దృఢంగా ఎదగడానికి ఏర్పాటు చేసినవని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. చదువుతో పాటు పిల్లలకు ఆటలు కూడా ఎంతో అవసరం. ఆటల ద్వారా పిల్లల్లో శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, టీమ్‌వర్క్, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.

ప్రస్తుతం పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, టీవీలు, వీడియో గేమ్స్‌తో గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఉన్న ఆట స్థలాలను అయినా వారికి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత పెద్దలపై ఉంది. పిల్లలను మొబైల్‌కు దూరంగా ఉంచి, ఆటల వైపు తీసుకురావాలంటే ముందుగా వారికి సరైన వాతావరణం కల్పించాలి.

అధికారులు కూడా ప్రతి కాలనీ, ప్రతి ప్రాంతంలో పిల్లలకు అవసరమైన ఆట స్థలాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలి. ఇప్పటికే ఉన్న ప్లే గ్రౌండ్స్‌లో ఆక్రమణలు, అనధికార పార్కింగ్, ఇతర కార్యకలాపాలను అరికట్టి, వాటిని పూర్తిగా పిల్లల వినియోగానికే కేటాయించాలి.

పిల్లల కోసం ఉన్న స్థలాలను పెద్దలు ఆక్రమించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. మన చిన్ననాట మనం ఆడుకున్నట్టే.. నేటి పిల్లలకు కూడా ఆడుకునే హక్కు ఉంది. ఆ హక్కును వారికి దూరం చేయకుండా, ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఎదిగేలా మనం సహకరించాలి.

— శ్రీహరి, విద్యార్థి

Please share