గిరిజన విద్యార్థిని మృతిపైఎల్హెచ్పిఎస్, ఎస్ఎఫ్ఐ ధర్నా
షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని కమ్మదనం గురుకుల పాఠశాలలో ముఢావత్ అశ్విని అనే గిరిజన విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే, ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్హెచ్పిఎస్) నాయకులు ఆరోపించారు. అశ్విని మృతికి సంబంధించిన వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేస్తూ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్తో పాటు పలువురు గిరిజన నాయకులు, కమిటీ సభ్యులు, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల నాయకులు గురువారం కమ్మదనం గురుకుల పాఠశాల వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రాంబాల్ నాయక్ మాట్లాడుతూ, ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా భావించి, అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టమవుతున్నదని వ్యాఖ్యానించారు. అశ్విని మృతిపై ప్రిన్సిపల్ సరైన సమాధానాలు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు. ఘటనకు గల అసలు కారణాలను వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గురుకుల పాఠశాలల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించాలని కూడా రాంబాల్ నాయక్ డిమాండ్ చేశారు. అశ్విని కుటుంబానికి ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని కోరారు. విచారణ అనంతరం, ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ నాయకులు వలియా రాజు నాయక్, నాయక్, మోహన్ నాయక్ , చందర్ నాయక్, సంజు నాయక్, సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
