November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

బొల్లారం ఆయుధాల చోరీ కేసును ఛేదించిన పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొల్లారం ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. బొల్లారం సైనిక ఆయుధాగారం (మద్రాస్ రెజిమెంట్) నుంచి చోరీకి గురైన ఏకే-47, పిస్టల్స్, బైనాక్యులర్స్‌తో పాటు పెద్ద మొత్తంలో తూటాలు, ఇతర మందుగుండు సామగ్రిని పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నాగర్‌కర్నూల్‌కు చెందిన మాజీ సైనిక అధికారి మల్లేశ్ అలియాస్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ డీజీపీ సీ.వీ. ఆనంద్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో బొల్లారం ఆయుధాల చోరీ ఘటనలో ఇంటి దొంగల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు.

పరిచయాలను ఉపయోగించుకుని ఆర్మీ ప్రాంగణంలోకి..

మల్లేశ్ గతంలో సైన్యంలో పనిచేశాడని, క్రమశిక్షణ, ఆరోగ్య కారణాలతో సైనిక అధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు డీజీపీ తెలిపారు. అయితే సైన్యంలో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని అతడు స్కూటీపై తరచూ ఆర్మీ ప్రాంగణంలోకి వెళ్లేవాడని వెల్లడించారు.

ఆగస్టు 30, 31 తేదీల్లో ఆయుధాలను భద్రపరిచే కోటకు సంబంధించిన తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించిన మల్లేశ్.. ఆయుధాలతో పాటు వాటికి సంబంధించిన మందుగుండు సామగ్రిని అపహరించినట్లు సీ.వీ. ఆనంద్ తెలిపారు. అనంతరం చోరీ చేసిన ఆయుధాలను నాగర్‌కర్నూల్‌లో దాచిపెట్టినట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఆయుధాలను ఎందుకు చోరీ చేశాడు?

అయితే మల్లేశ్ ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలను ఎందుకు చోరీ చేశాడనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని డీజీపీ తెలిపారు. ప్రస్తుత దర్యాప్తు ప్రకారం ఈ ఆయుధాలను సంఘవిద్రోహ శక్తులకు లేదా విదేశీ ముఠాలకు విక్రయించే ప్రయత్నం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.

ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పూర్తి వివరాలు వెల్లడైన తర్వాత మరిన్ని అంశాలను తెలియజేస్తామని సీ.వీ. ఆనంద్ చెప్పారు.

రెండు లక్షల ఫోన్ల విశ్లేషణ

బొల్లారం ఆయుధాల చోరీ కేసును ఛేదించేందుకు పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. దాదాపు 2 లక్షల ఫోన్ నంబర్లకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడంతో పాటు, కంటోన్మెంట్ ప్రాంతానికి దారితీసే మార్గాల్లో ఉన్న వేలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినట్లు డీజీపీ తెలిపారు.

సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల దర్యాప్తు కొంత ఆలస్యమైందని ఆయన వెల్లడించారు. అయితే పోలీసు అధికారులు పలు రాత్రులు శ్రమించి కేసును ఛేదించారని తెలిపారు.

భద్రతా వైఫల్యాలపై వ్యాఖ్యానించని డీజీపీ

సైనిక ప్రాంతంలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని సీ.వీ. ఆనంద్ స్పష్టం చేశారు. ఈ అంశంపై సైనిక అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి మొత్తం సురక్షితంగా స్వాధీనం చేసుకున్నామని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే ప్రస్తుతం మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు.

కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీ.వీ. ఆనంద్ అభినందించారు.https://janammata.net/varahi-ammavaru/

Please share