November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

కాలుష్యం బారిన శ్రామిక వర్గం

ఢిల్లీ గాలి కాలుష్యం కేవలం పర్యావరణ సమస్యతోపాటు, నగరంలోని వర్గ విభజనను స్పష్టంగా ప్రతిబింబిస్తున్న సామాజిక సంక్షోభం. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఎక్యుఐ) ‘ప్రమాదకరం’,  ‘తీవ్రతరం’ స్థాయిల మధ్య ఊగిసలాడుతున్న వేళ, ఈ విషపూరిత గాలిని ఎక్కువగా పీలుస్తున్నవారు నగరాన్ని నడిపించే వలస కార్మికులు, రోజువారీ కూలీలు, అసంఘటిత రంగ శ్రామికులే. తలనొప్పి, శ్వాస సమస్యలు ఇప్పుడు సాధారణమయ్యాయి. చాలా మంది పరిస్థితి దయనీయంగా ఉంది. పిల్లలు అలసటతో బాధపడుతుంటే, పొగమంచు కారణంగా పాఠశాలలు మూసేస్తారు. వైద్యం అందుబాటులో లేక, తక్కువ ఖర్చు అయ్యే ఇంటి చిట్కాలకే ఎక్కువ మంది పరిమితంకాక తప్పడం లేదు.

ఎన్నో ఆశలతో ఢిల్లీకి వచ్చిన తమ జీవితం ఇప్పుడు కేవలం బతకడానికే పరిమితమైందని వలస కార్మికుల ఆవేదన. ఢిల్లీ అంతటా కార్మిక వర్గానికి కాలుష్యం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. నిర్మాణం, డ్రైవింగ్‌, వీధి వ్యాపారం, పారిశుద్ధ్యం, డెలివరీ, గృహ సేవల వంటి పనులు చేసే వారు ఎంత విషపూరితమైన గాలి ఉన్నా… ఎంత కాలుష్యం చిమ్ముతున్నా.. బయటే పనిచేయాల్సి ఉంటుంది. ఒక రోజు పని మానేస్తే ఆకలి తప్పదు. కాలుష్యాన్ని పీల్చుకోవడమా, లేక ఉపాధిని కోల్పోవడమా అన్నది వారి ముందు ఉన్న క్రూరమైన ఎంపిక. ‘మోస్తరు లేదా పచ్చ జోన్లు కూడా ఆరోగ్యానికి హానికరమే. భారత జనాభాలో దాదాపు 98 శాతం మంది అసురక్షిత గాలి స్థాయిలకు గురవుతున్నారు. ఢిల్లీ ప్రత్యేకంగా కనిపించడానికి కారణం, అక్కడ కాలుష్యం చూడగలిగేంత గాఢంగానూ, తీవ్రంగానూ ఉండటమే. ఈ సంక్షోభంలో ‘వర్గం’ కీలక పాత్ర పోషిస్తుంది. సంపన్నులకు సీల్డ్‌ కార్యాలయాలు, ఎయిర్‌ ప్యూరిఫయర్లు, ఫిల్టర్డ్‌ వెంటిలేషన్‌ వంటి రక్షణలు సులభంగా లభిస్తాయి. పేదలకు మాత్రం అది అందని ద్రాక్ష. ఇక్కడ పేదరికమే ఒక ప్రమాదకర అంశం. ఏమాత్రం వసతులులేని.. పరిశుభ్రతకానరాని గృహాలు, గుంపులుగా నివాసాలు… వంట ఇంధనాల వల్ల ఇంట్లో కాలుష్యం. బయట నిరంతర పనితో మరింత ప్రమాదం. ఇవన్నీ కలిసి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి.

ఈ పరిస్థితుల ఫలితంగా  ‘క్రానిక్‌ అబ్స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌’ (సిఒపిడి) భారత్‌లో మరణాలకు రెండో ప్రధాన కారణంగా మారింది. ఒకప్పుడు పొగతాగేవారికి మాత్రమే అనుకున్న ఈ వ్యాధి, ఇప్పుడు గాలి కాలుష్యంతో ముడిపడి ఉంది. ఢిల్లీలో పిఎం2.5 కాలుష్యం జీవితకాలాన్ని సగటున 8.2 సంవత్సరాలు తగ్గిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి.  రాజధానిలో ప్రతి ఏడుగురిలో ఒకరి మరణానికి కాలుష్యమే కారణమని 2023 నివేదికలు పేర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాల లేమి ఢిల్లీకి వలసలను పెంచుతోంది. జనగణన ప్రకారం నగరంలో లక్షలాది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో చాలామంది హైవేలు, పరిశ్రమలు, చెత్త కుప్పల దగ్గరే నివసిస్తూ, రోజంతా కాలుష్యాన్ని పీల్చుకుంటున్నారు. ఇక్కడ వారి ఇళ్లు కాలుష్యాన్ని బంధిస్తాయి… వారి పని వాతావరణం దాన్ని మరింత పెంచుతాయి. కార్మిక సంక్షేమ చట్టాలు ఈ వాస్తవాన్ని పట్టించుకోవడం లేదు. నిర్మాణ పనులు ‘జిఆర్‌ఎపి’ కింద నిలిపివేస్తే,  బిఒసిడబ్ల్యు బోర్డులో నమోదు అయిన కొద్దిమందికే ఎక్స్‌గ్రేషియా లభిస్తుంది. ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో ఉన్న లక్షలాది గిగ్‌, అసంఘటిత కార్మికులకు ఎలాంటి మద్దతు లేదు.

కాలుష్యాన్ని వృత్తి ప్రమాదంగా గుర్తించకపోవడం ఈ అన్యాయానికి మూలం. ఆరోగ్య పరిరక్షణ విధానాలు కూడా అంతంత మాత్రమే. ఆయుష్మాన్‌ భారత్‌ ఆసుపత్రి చికిత్సకే పరిమితం. శ్వాసకోశ సమస్యలకు అవసరమైన అవుట్‌పేషెంట్‌ చికిత్స ఖర్చు కార్మికుల జేబుల నుంచే వెళ్తుంది. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, మందుల లేమి, మొహల్లా క్లినిక్‌ల మూసివేత వలస కార్మికులను మరింత అసురక్షితులుగా మారుస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు తాత్కాలిక నియంత్రణలకే పరిమితం. వాహన నిషేధాలు, నిర్మాణాల నిలిపివేతలు కార్మికుల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి కానీ, వారికి ఆరోగ్య లేదా ఆదాయ భద్రత ఇవ్వడం లేదు. ఇదే సమయంలో ఢిల్లీ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగి కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే, గాలి కాలుష్యాన్ని కార్మిక.. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా గుర్తించాలి. కాలుష్యం, వాతావరణ ప్రమాదాలను వృత్తి ప్రమాదాలుగా చట్టబద్ధంగా గుర్తించి, రక్షణ పరికరాలు, సమీప ఆరోగ్య కేంద్రాలు, ఆదాయ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య శాఖ ఈ పోరాటానికి నాయకత్వం వహించాలి.. ఇతర అన్ని శాఖలు బాధ్యత తీసుకోవాలి. అది జరిగే వరకు, ఢిల్లీని నిర్మిస్తున్న, నడిపిస్తున్న అత్యంత బలహీన వర్గాలు ఈ నగరం ఉత్పత్తి చేసే విషపూరిత గాలిని తమ శరీరాల్లోకి తీసుకోవాల్సిందే… అది వారి ఎంపిక కాదు, వారి తప్పనిసరి పరిస్థితి.

పేదలపై పర్యావరణ ప్రమాదాల తీవ్ర ప్రభావం
ఆక్స్‌ఫర్డ్‌ పావర్టీ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనిషియేటివ్‌ (ఒపిహెచ్‌ఐ), ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన గ్లోబల్‌ మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ (ఎంపిఐ) నివేదిక కేవలం గణాంకాల సమాహారం కాదు; ఇది ప్రపంచానికి ఇచ్చిన తీవ్ర హెచ్చరిక. పేదరికం మరియు వాతావరణ మార్పు ఇక వేర్వేరు సమస్యలు కావని, అవి ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. తాజా నివేదిక ప్రకారం, 651 మిలియన్‌ పేదలు రెండు లేదా అంతకంటే ఎక్కువ వాతావరణ ప్రమాదాలను ఒకేసారి ఎదుర్కొంటుండగా, 309 మిలియన్‌ మంది మూడు లేదా నాలుగు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో పేదరికం 24.8 , తక్కువ ప్రమాదాలున్న ప్రాంతాల్లో ఇది 14.4% మాత్రమే. అంటే, వాతావరణ మార్పు పేదరికాన్ని తగ్గించడం కాదు… మరింత పెంచుతోంది.

ఎంపిఐ తొలిసారిగా పేదరికాన్ని ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల లోపాలతో పాటు నాలుగు ప్రధాన వాతావరణ ప్రమాదాలు, తీవ్ర వేడి, కరువు, వరదలు, వాయు కాలుష్యంతో కలిపి విశ్లేషించింది. దీని ఫలితం ‘డబుల్‌ భారము’: ప్రపంచంలోని పేదలలో దాదాపు 80% మంది కనీసం ఒక వాతావరణ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. ప్రస్తుతం 109 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 1.1 బిలియన్‌ మంది బహుముఖ పేదరికంలో జీవిస్తుండగా, అందులో 887 మిలియన్‌ మంది కనీసం ఒక వాతావరణ ప్రమాదానికి గురవుతున్నారు. పేదరికం పెరిగితే వాతావరణ దెబ్బలకు లోనయ్యే అవకాశం పెరుగుతోంది. ఆ దెబ్బలే మళ్లీ పేదరికాన్ని మరింత లోతుగా చేస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పేదలలో దాదాపు మూడింట రెండు వంతుల మంది (740 మిలియన్‌) మంది మధ్య ఆదాయ దేశాల్లోనే ఉన్నారు. వేగవంతమైన, నియంత్రణలేని పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణ వల్ల వాయు కాలుష్యం, నీటి కొరత, కాలుష్యం పెరిగి పరిస్థితి మరింత దిగజారుతోంది. లోయర్‌ ఇన్‌కమ్‌ దేశాల్లో పరిస్థితి అత్యంత తీవ్రం: 548 మిలియన్‌ పేదలు కనీసం ఒక ప్రధాన వాతావరణ ప్రమాదానికి గురవుతున్నారు. 577 మిలియన్‌ మందిపై వాయు కాలుష్యం ప్రభావం ఉండగా, 600 మిలియన్‌ మందికి శుభ్రమైన ఇంధనం, పారిశుద్ధ్యం, సరైన గృహాలు లేవు.

ఈ సంక్షోభంలో అత్యంత బాధితులు పిల్లలు. ఎంపిఐ పరిధిలో వారు జనాభాలో మూడో వంతు మాత్రమే అయినా, మొత్తం బహుముఖ పేదలలో సగానికి పైగా (586 మిలియన్‌) పిల్లలే. పిల్లల పేదరిక రేటు 27.8%, పెద్దలది 13.5% మాత్రమే. యునిసెఫ్‌ దీనిని బాలల హక్కుల సంక్షోభంగా పేర్కొంది. నివేదిక మరో ఆందోళనకర అంశాన్ని వెల్లడించింది: 2018 తర్వాత ప్రపంచవ్యాప్తంగా పేదరిక తగ్గుదల ఆగిపోయింది. పరిశీలించిన 92 ఉపజాతీయ ప్రాంతాల్లో 83 ప్రాంతాల్లో పురోగతి నిలిచిపోయింది లేదా వెనక్కి వెళ్లింది. భవిష్యత్‌ అంచనాలు మరింత భయంకరంగా ఉన్నాయి. అత్యధిక పేదరికం ఉన్న దేశాలే అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత పెరుగుదలను ఎదుర్కొనబోతున్నాయి. అధిక ఉద్గారాల పరిస్థితిలో, ఈ దేశాల్లో శతాబ్దాంతానికి ఏటా 92 అదనపు తీవ్రమైన వేడి రోజులు ఉండొచ్చు. తక్కువ పేదరికం ఉన్న దేశాల్లో ఇది 62 రోజులు మాత్రమే. వాతావరణ మార్పుకు తక్కువ బాధ్యులైనవారే ఎక్కువ మూల్యం చెల్లిస్తున్నారు అనే అన్యాయాన్ని ఇది స్పష్టంగా చూపుతోంది.

భౌగోళికంగా చూస్తే, దక్షిణ ఆసియా, ఉప-సహారా ఆఫ్రికా కలిపి ప్రపంచ బహుముఖ పేదలలో 83.2% వాటా కలిగి ఉన్నాయి. దక్షిణ ఆసియాలో గత రెండు దశాబ్దాల్లో పేదరికం గణనీయంగా తగ్గినప్పటికీ, భారతదేశం ఒక్కటే 2005 నుంచి 2019 మధ్య 400 మిలియన్‌ మందిని పేదరికం నుంచి బయటకు తీసినా ప్రమాదాల వల్ల ఈ పురోగతి ప్రమాదంలో పడింది. ఇక్కడి పేదలలో 99.1% మంది కనీసం ఒక వాతావరణ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తుండగా, 59% మంది (226 మిలియన్‌) మూడు లేదా నాలుగు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ఉప-సహారా ఆఫ్రికాలో పరిస్థితి ఇంకా తీవ్రమైనది. ప్రపంచంలోని తీవ్రమైన పేదలలో దాదాపు సగం (565 మిలియన్‌) ఇక్కడే ఉన్నారు. వారిలో 193 మిలియన్‌ మంది బహుళ వాతావరణ ప్రమాదాలకు గురవుతున్నారు. పేదరిక నిర్మూలన, వాతావరణ చర్యలను వేర్వేరుగా చేపట్టలేం. మానవ అభివృద్ధి స్థిరత్వం పరస్పర ఆధారితమైనవి. అందుకే ప్రభుత్వాలు వాతావరణానికి తట్టుకునే జీవనోపాధులు, అనుకూల సామాజిక రక్షణ వ్యవస్థలు, గ్రీన్‌ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు అత్యవసరంగా ప్రాధాన్యం ఇవ్వాలి.https://janammata.net/land-sealing-act/

జనంమాట – మీ గొంతు మా వేదిక

మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.

వివరాలకు:

E Mail: Satyamediasolutions@gmail.com

Phone Number: 97045 35591

Please share