November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

హైదరాబాద్ లో భారీ వర్షం-రోడ్లు జలమయం

హైదరాబాద్ లో భారీ వర్షం పడింది, దీనితో రోడ్లన్నీ జలమయం అయ్యాయి, ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, లోతట్టు ప్రాంతాలు జలయం అయ్యాయి దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌ జాం అయింది. సాయంత్రం ఆఫీస్ వదిలే సమయంలో వర్షం పడడంతో ట్రాఫిక్ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి, ముఖ్యంగా ఐటీ కారిడార్ వద్ద ట్రాఫిక్ నిల్చిపోయింది. నగరంలోని గచ్చిబౌలీ, మాధాపూర్, జూబ్లీహిల్స్ , యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఉప్పల్, నాగోల్, నాచారం, మల్కాజ్ గిరి, దిల్ షుఖ్ నగర్, వనస్థలిపరం పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది.

వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మున్సిపల్‌ కమిషనర్లు, హైడ్రా, పోలీస్‌ కమిషనర్లు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ప్రధాన రహదారులు, జంక్షన్లు, నివాస ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో సిబ్బంది, సహాయక బృందాలు, యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, గతంలో నీటిముంపునకు గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

డ్రైనేజీలు, నాలాల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడకుండా చూడాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, వర్షాల కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

మరోవైపు హైదరాబాద్‌లో మేఘావృత వాతావరణం కొనసాగుతుండగా, నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, నీరు నిలిచిన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Please share