November 27, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

అకాశమే హద్దుగా హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవం …

హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం ఏఐ చిత్రం

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవాకి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అసలు నగరంలో గణేశ్ ఉత్సవాలు, శోభా యాత్ర ఎప్పుడు మొదలయాయ్యో చూద్దాం… ఇంతితై వటుడింతై అన్నట్టుగా సాగింది భాగ్యనగర్ గణేశ్ ఉత్సవాల ప్రస్థానం. ఒకప్పుడు ఇంటి ముందు చిన్న మట్టి వినాయకుడిని పెట్టి, భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, సమీపంలోని చెరువు లేదా కాలువలో నిమజ్జనం చేసేవారు. నేడు వేలాది మండపాలు, భారీ విగ్రహాలు, లక్షలాది మంది భక్తులు, ప్రత్యేక వాహనాలు, రాత్రింబవళ్లు కొనసాగే శోభాయాత్రలు, చివరకు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం—హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవం ఇలా మహా వేడుకగా మారింది, హైదరబాద్ గణేశ్ నిమజ్జనోత్సవం ఇప్పుడు దేశవ్యాప్త గుర్తింపు పొందింది.

అయితే ఈ రూపం ఒక్కరోజులో ఏర్పడలేదు. హైదరాబాద్ నగరంలో గణేశ్ ఉత్సవాలు దశాబ్దాల కాలంలో క్రమంగా మారుతూ వచ్చాయి. ముఖ్యంగా 1954లో ఖైరతాబాద్‌లో ప్రారంభమైన ఒక అడుగు వినాయకుడి నుంచి, 1970–80 దశకాల్లో పెరిగిన సామూహిక ఉత్సవాలు, ఆ తర్వాత ఏర్పడిన నగరవ్యాప్త నిమజ్జన శోభాయాత్ర—ఈ పరిణామం హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది,బాలగంగాధర్ తిలక్‌ గణేశ్ ఉత్సవాన్ని సార్వజనిక కార్యక్రమంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు.

1954లో ఖైరతాబాద్‌లో ఒక్క అడుగుతో మొదలై….

హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల చరిత్రలో 1954 ఒక ముఖ్యమైన సంవత్సరం.

ఆ ఏడాది స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఖైరతాబాద్‌లో ఒక్క అడుగు ఎత్తైన మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆయన కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ప్రజలను ఒకచోటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. తిలక్ ప్రజలను ఐక్యం చేయడానికి గణేశ్ ఉత్సవాన్ని ఉపయోగించిన విధానం కూడా ఆయనకు స్ఫూర్తిగా నిలిచిందని నిర్వాహకులు చెబుతున్నారు.

అప్పట్లో ఖైరతాబాద్‌లో నేటి మాదిరిగా ఆకాశాన్ని తాకే విగ్రహం లేదు. చిన్న మండపం, చిన్న విగ్రహం, స్థానికుల విరాళాలు, భక్తుల భాగస్వామ్యంతో ఉత్సవం సాగేది.

కాలం గడిచేకొద్దీ ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం ఎత్తు పెరుగుతూ వచ్చింది. 2014లో ఉత్సవం 60వ సంవత్సరానికి చేరుకున్నప్పుడు 60 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా ఎత్తులో మార్పులు చోటుచేసుకున్నాయి. 2019లో 65 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు కాగా, 2021లో కరోనా పరిస్థితుల కారణంగా ఎత్తును 40 అడుగులకు తగ్గించారు.

అప్పటి మండపాలు ఎలా ఉండేవి?

నేటి భారీ స్టీల్ నిర్మాణాలు, థీమ్ సెట్లు, LED స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టమ్స్‌తో పోలిస్తే పాతకాలపు మండపాలు చాలా సరళంగా ఉండేవి.

వీధి లేదా బస్తీలోని స్థానికులు కలిసి విరాళాలు సేకరించేవారు. వెదురు కర్రలు, వస్త్రాలు, అలంకరణ సామగ్రితో తాత్కాలిక మండపాలు నిర్మించేవారు. కొన్నిచోట్ల కొబ్బరి ఆకులు, రంగురంగుల వస్త్రాలు, పూలతో అలంకరణ చేసేవారు.

మండపం చుట్టూ సాయంత్రం భజనలు, హరికథలు, పురాణ ప్రవచనాలు, చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. పిల్లలు, యువకులు ఉత్సవ నిర్వహణలో చురుకుగా పాల్గొనేవారు.

అంటే అప్పటి గణేశ్ మండపం ప్రధానంగా పూజా స్థలం మాత్రమే కాకుండా ఆ బస్తీ ప్రజల సామాజిక సమావేశ కేంద్రంగా కూడా ఉండేది.

ఖైరతాబాద్ తొలి దశ గురించి నిర్వాహకుల కుటుంబ కథనం కూడా ఇదే విషయాన్ని సూచిస్తుంది. 1954లో ఏర్పాటైన చిన్న మండపం స్థానిక ప్రజలు కలుసుకుని ఆలోచనలు పంచుకునే వేదికగా కూడా మారిందని వారు చెబుతున్నారు.

మొదట్లో నిమజ్జనం ఎక్కడ జరిగేది?

ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం మొదటి నుంచే అన్ని విగ్రహాలకు ఒకే చోట జరిగేది కాదు.

చిన్న విగ్రహాలను ఆయా ప్రాంతాలకు సమీపంలోని చెరువులు, కుంటలు, నీటి వనరుల్లో స్థానికంగా నిమజ్జనం చేసేవారు. నగరంలోని అన్ని మండపాలు ఒకే రోజున ఒకే మార్గంలో హుస్సేన్‌సాగర్‌కు వెళ్లే నేటి విధానం క్రమంగా ఏర్పడింది.

తర్వాత హుస్సేన్‌సాగర్ నగరవ్యాప్త గణేశ్ నిమజ్జనానికి ప్రధాన కేంద్రంగా మారింది. 1980ల ప్రారంభంలో సుమారు 5,000 విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కాగా, 2001 నాటికి ఆ సంఖ్య సుమారు 18,000కు చేరింది అప్పటి నుండి మరింత గణనీయం పెరుగుతూ పోయింది, ప్రస్తుతం సుమారు 1.5 లక్షల మండపాల్లో వినాయకుడిని ప్రతిస్టిస్తున్నారు. ఈ రకంగా హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.

హుస్సేన్‌సాగర్ ఎలా ప్రధాన నిమజ్జన కేంద్రంగా మారింది?

హైదరాబాద్ భౌగోళికంగా కూడా హుస్సేన్‌సాగర్ చుట్టూ విస్తరించింది. ఈ చెరువు హైదరాబాద్, సికింద్రాబాద్‌లను కలిపే కీలక ప్రాంతంలో ఉండటంతో పెద్ద ఊరేగింపులకు అనుకూలమైన కేంద్రంగా మారింది.తొలుత చిన్న చిన్న ప్రాంతీయ ఊరేగింపులు ఉండగా, తరువాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినాయక విగ్రహాలు ప్రధాన మార్గాల్లోకి చేరి హుస్సేన్‌సాగర్ వైపు వెళ్లే పద్ధతి పెరిగింది.

1970–80 దశకాలు: హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో కీలక మలుపు

హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవం నగరవ్యాప్త రూపాన్ని సంతరించుకోవడంలో 1970ల చివరి, 1980ల కాలం కీలకంగా నిలిచింది.

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తన అధికారిక చరిత్రలో 1980లో సుమారు 1,500 మండపాలతో తన కార్యకలాపాలను ప్రారంభించినట్లు పేర్కొంటుంది. తరువాత నగరంలో మండపాల సంఖ్య భారీగా పెరిగింది.

ఇదే కాలంలో నిమజ్జన ఊరేగింపులు కూడా మరింత వ్యవస్థీకృతమయ్యాయి.

1980లో బాలాపూర్ గణేశ్‌ను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడం ప్రారంభించారు, అప్పుడే బాలాపూర్ వినాయకుడితో పాటుగా పాతబస్తీలోని ప్రధాన మండపాలు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ కు తరలివచ్చేవి. దీంతో బాలాపూర్ గణేశ్ ముందుగా బయలుదేరడం, ఆ తర్వాత నగరంలోని ఇతర విగ్రహాలు శోభాయాత్రలో చేరడం అనే సంప్రదాయం బలపడింది.

లడ్డూ వేలం

బాలాపూర్ గణేశ్‌కు మరో ప్రత్యేక గుర్తింపు లడ్డూ వేలం.

బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రకారం 1994లో తొలిసారి లడ్డూ వేలం నిర్వహించారు. మొదటి వేలంలో లడ్డూ రూ.450కు విక్రయమైంది. తరువాత ఈ సంప్రదాయం మరింత ప్రాచుర్యం పొందింది.

ఇలా బాలాపూర్ గణేశ్ కేవలం ఒక మండపం విగ్రహంగా కాకుండా హైదరాబాద్ గణేశ్ నిమజ్జన యాత్రకు ఒక ప్రతీకగా మారింది.

ప్రసిద్ధ మండపాలు

వినాయక చవితి ఉత్సవాలు అంటే మనకు ప్రధానంగా ఖైరతాబాద్, బాలాపూర్ వంటి వినాయక మండపాలు గుర్తుకు వస్తాయి అయితే వీటితో పాటుగా అంతటి ప్రదాన్యం ఉన్న మండపాలు అనేకం ఉన్నాయి, లాల్ దర్వాజా లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసే మండపంతో పాటుగా గౌలీపుర, ఆలియాబాద్, చత్రినాక, చార్ కమాన్ మండపాలు అనేక సంవత్సరాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని అనేక మండపాల్లో 50 సంవత్సరాలకు పైగా ఉత్సవాలను నిర్వహిస్తున్న చరిత్ర ఉంది.

అయితే కొ

మండపం నుంచి శోభాయాత్ర వరకు…

మొదట్లో ఒక బస్తీలో గణేశుడిని పెట్టడం అంటే ఆ బస్తీ ప్రజల పండుగ.

తరువాత అదే మండపం చుట్టూ పది రోజుల పాటు కార్యక్రమాలు జరిగాయి. ఆ మండపానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు రావడం మొదలైంది.

తర్వాత నిమజ్జనం రోజున అదే మండపం నుంచి విగ్రహాన్ని అలంకరించిన వాహనంపై తీసుకెళ్లడం మొదలైంది.

వాహనం వెనుక యువకులు, మహిళలు, పిల్లలు, భక్తులు చేరారు. డప్పులు, భజనలు, బ్యాండ్ బృందాలు వచ్చాయి.

ఒక ప్రాంతపు ఉత్సవం క్రమంగా నగర ఉత్సవంగా మారింది.

ఇదే హైదరాబాద్ గణేశ్ శోభాయాత్ర పరిణామానికి ప్రధాన కథ.

భారీ విగ్రహాల యుగం

ఖైరతాబాద్ గణేశ్ ఈ పరిణామానికి అత్యంత స్పష్టమైన ఉదాహరణ.

1954లో ఒక అడుగుతో మొదలైన విగ్రహం కాలక్రమంలో భారీ రూపాన్ని సంతరించుకుంది. 2014లో 60 అడుగులకు చేరింది. 2019లో 65 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయగా, భారీ విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌కు తరలించడం ప్రతి సంవత్సరం పెద్ద సవాలుగా మారింది.

ఇక నగరంలోని ఇతర మండపాల్లో కూడా కాలక్రమేణా చిన్న మట్టి విగ్రహాల స్థానంలో పెద్ద విగ్రహాలు, ప్రత్యేక థీమ్‌లు, అలంకరణలు, విద్యుత్ దీపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెరిగాయి.

మట్టి నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వరకు

పాతకాలంలో వినాయక విగ్రహాల తయారీలో మట్టి ప్రధాన పదార్థం.

తరువాత పెద్ద విగ్రహాలు, మెరుగైన ఆకృతులు, త్వరగా తయారు చేయగల సాంకేతికత కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) వినియోగం పెరిగింది.

ఖైరతాబాద్ నిర్వాహకులు కూడా ఒక దశలో మట్టి నుంచి PoP వైపు మారినట్లు తెలిపారు. PoPతో విగ్రహానికి మెరుగైన ఫినిషింగ్ వస్తుందని వారు పేర్కొన్నారు.

అయితే హుస్సేన్‌సాగర్ కాలుష్యం నేపథ్యంలో మట్టి విగ్రహాలు, PoP విగ్రహాల నిమజ్జనంపై గత రెండు దశాబ్దాలుగా పర్యావరణ చర్చలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో పెద్ద సంఖ్యలో గణేశ్, దుర్గ విగ్రహాల నిమజ్జనం కూడా సరస్సు కాలుష్యానికి కారణమయ్యే అంశాల్లో ఒకటిగా HMDA పేర్కొంటోంది.

ఒకప్పుడు ఐదు వేల విగ్రహాలు.. ఇప్పుడు లక్షల్లో

హైదరాబాద్ గణేశ్ ఉత్సవం ఎంతగా విస్తరించిందో సంఖ్యలు చెబుతున్నాయి.

1980లో సుమారు 1,500 పబ్లిక్ మండపాలతో ప్రారంభమైన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, 2011 నాటికి నగరంలో దాదాపు 50,000 మండపాలు ఉన్నాయని పేర్కొంది.

2026లో 1.50 లక్షలకు పైగా గణేశ్ మండపాలు ఏర్పాటయినట్టు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అంచనా వేస్తోంది. నగరంతో పాటుగా మండపాల సంఖ్య కూడా భారీగా పేరుగుతోంది.హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవం ఇక ఒక ప్రాంతపు పండుగ కాదు. అది నగర సంస్కృతిలో భాగమైన భారీ సామూహిక ఉత్సవంగా మారింది.

“ఇంటి ముందు చిన్న మట్టి వినాయకుడి నుంచి, వీధి మండపం వరకు; అక్కడి నుంచి బస్తీ ఉత్సవం వరకు; బస్తీ నుంచి నగరవ్యాప్త శోభాయాత్ర వరకు; చివరకు హుస్సేన్‌సాగర్‌ను కేంద్రంగా చేసుకున్న మహా నిమజ్జనోత్సవం వరకు జరిగిన పరిణామమే హైదరాబాద్ గణేశ్ చరిత్ర.

Please share