సీఎం సహా మంత్రుల ట్యాక్స్ లు చెల్లించేది ప్రజలే
ప్రతీ ఒక్కరూ తమకు వచ్చిన వేతనానికి సంబంధించిన ఇన్ కం ట్యాక్స్ వాళ్లే కట్టుకుంటారు. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారందరి పరిస్థితి ఇదే అయితే ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా వారికి వచ్చే జీతానికి వాళ్లు ట్యాక్స్ కట్టరు వారి ట్యాక్స్ కూడా ప్రభుత్వమే అంటే పరోక్షంగా ప్రజలే కడుతున్నారు, సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ ) బయటికి తీసింది…సమాచార హక్కు చట్టం ద్వారా లెజిస్లేచర్ జాయింట్ సెక్రెటరీ నుంచి పొందిన 13 పేజీల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ‘పేమెంట్ ఆఫ్ శాలరీస్ యాక్ట్–1953’లోని సెక్షన్ 3(4) ప్రకారం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల జీతభత్యాలపై చెల్లించాల్సిన ఆదాయపు పన్నును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని ఆయన తెలిపారు.
ఈ నిబంధన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లోని సమానత్వ సూత్రానికి విరుద్ధంగా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటోంది, దేశంలోని పలు రాష్ట్రాలు ఇలాంటి నిబంధనలను రద్దు చేసినప్పటికీ తెలంగాణలో మాత్రం ప్రజాధనంతో ప్రజాప్రతినిధుల పన్నులు చెల్లించే విధానం కొనసాగుతోందని విమర్శించింది.
లక్షల్లో జీతాలు ట్యాక్స్ మాత్రం సున్నా?
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నెలకు సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతభత్యాలు అందుతున్నప్పటికీ, అధికారికంగా చూపించే బేసిక్ పే మాత్రం రూ.20 వేలుగా ఉందని ఎఫ్‌జీజీ పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని వివిధ అలవెన్సుల రూపంలో చెల్లిస్తున్నారని తెలిపింది.
శాసనమండలి చైర్మన్‌కు నెలకు రూ.4.11 లక్షల వరకు చెల్లిస్తుండగా, అందులో బేసిక్ వేతనం రూ.41 వేలేనని పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని వివిధ భత్యాల రూపంలో చెల్లిస్తున్నారని ఎఫ్‌జీజీ తెలిపింది. ఈ విధానం వల్ల పన్ను భారం తగ్గే అవకాశం ఉంటుందని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది.
విప్‌లకు రూ.4 లక్షల వరకు.. బేసిక్ మాత్రం రూ.20 వేలు
అధికార పార్టీకి ఆరుగురు విప్‌లను నియమించారని ఎఫ్‌జీజీ తెలిపింది. వీరికి నెలకు సుమారు రూ.4 లక్షల వరకు పారితోషికం అందుతున్నప్పటికీ, రికార్డుల్లో బేసిక్ వేతనం రూ.20 వేలుగా ఉందని పేర్కొంది.
ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 1064 ద్వారా ముగ్గురు విప్‌లకు మంత్రుల హోదా కల్పించడంపైనా ఎఫ్‌జీజీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగంలో విప్ అనే పదవికి ప్రత్యేక ప్రస్తావన లేదని పేర్కొంటూ, ప్రజాధనంపై అదనపు భారం మోపే నిర్ణయాలను పునఃపరిశీలించాలని కోరింది.
ఎఫ్‌జీజీ డిమాండ్లు ఇవే..
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఆదాయపు పన్నును ప్రభుత్వమే చెల్లించేలా ఉన్న ‘పేమెంట్ ఆఫ్ శాలరీస్ యాక్ట్–1953’లోని సెక్షన్ 3(4)ను రద్దు చేయాలి.
బేసిక్ పే తక్కువగా, అలవెన్సులు ఎక్కువగా చూపించే విధానాన్ని క్రమబద్ధీకరించాలి.
విప్‌లకు కల్పించిన మంత్రుల హోదాను ఉపసంహరించుకోవాలి.
ప్రతి రాజకీయ పార్టీకి ఒక్క విప్ మాత్రమే ఉండేలా నిబంధనలు తీసుకురావాలి.
ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, పన్నుల చెల్లింపు విధానం, అలవెన్సులపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని ఎఫ్‌జీజీ కోరింది.https://janammata.net/shivakasi/
జనంమాట – మీ గొంతు మా వేదిక
మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.
వివరాలకు:
E Mail: Satyamediasolutions@gmail.com
Phone Number: 97045 35591
