November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

సానియా మిర్జా తన స్థలాన్ని మసీదుకు ఇచ్చారా..?

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఫేక్ ఫొటో...

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మరోసారి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. హైదరాబాద్‌లో మసీదు నిర్మాణం కోసం సానియా మీర్జా తనకు సంబంధించిన భూమిని విరాళంగా ఇచ్చారంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తోడు మాజీ క్రికెటర్‌, తెలంగాణ మంత్రి మహమ్మద్‌ అజారుద్దీన్‌తో కలిసి సానియా మీర్జా మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా స్పష్టం చేశారు. వైరల్‌ అవుతున్న ఫొటోలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ద్వారా సృష్టించినవని వెల్లడించారు.

సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం..

సానియా మీర్జాకు చెందిన భూమిని మసీదు నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారంటూ ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌), వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌ అయ్యాయి. హైదరాబాద్‌లోని ఆమెకు సంబంధించిన కమర్షియల్‌ ప్రాపర్టీ సమీపంలో మసీదు లేదని, స్థానిక ముస్లింలు ప్రార్థనల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని గుర్తించిన సానియా.. అక్కడ మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించారంటూ పోస్టులు ప్రచారంలోకి వచ్చాయి.

మరోవైపు తొలుత ఆ స్థలంలో టెన్నిస్‌ అకాడమీ నిర్మించాలని భావించారని, ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని మసీదు నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చారంటూ కథనాలు సృష్టించారు. దీనికి ఆధారంగా సానియా మీర్జా, మహమ్మద్‌ అజారుద్దీన్‌ కలిసి మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లుగా ఓ ఫొటోను కూడా ప్రచారం చేశారు. మరికొన్ని పోస్టుల్లో స్థలానికి సంబంధించిన పత్రాలను సానియా, అజారుద్దీన్‌ మతపెద్దలకు అందజేస్తున్నట్లుగా మరో ఫొటోను షేర్‌ చేశారు.

సానియా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా క్లారిటీ..

ఈ ప్రచారం విస్తృతంగా వ్యాపించడంతో సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా స్పందించారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వివరణ ఇచ్చారు. సానియా గురించి వక్రీకరించిన, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

సానియా మీర్జా టెన్నిస్‌ అకాడమీ నిర్మించిన స్థలంలో ఎలాంటి మసీదు నిర్మాణం జరగడం లేదని స్పష్టం చేశారు. సానియా, అజారుద్దీన్‌ కలిసి ఉన్నట్లుగా వైరల్‌ అవుతున్న ఫొటో కూడా ఏఐ ద్వారా రూపొందించిందేనని వెల్లడించారు.

తన కుమార్తె లేదా కుటుంబం కొనుగోలు చేసిన భూమిని ఎలా ఉపయోగించుకోవాలనేది వారి వ్యక్తిగత నిర్ణయమని, అయితే టెన్నిస్‌ అకాడమీ ఉన్న స్థలంలో మసీదు నిర్మిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని ఇమ్రాన్‌ మీర్జా స్పష్టం చేశారు.

సామాజిక సేవ కూడా వ్యక్తిగత విషయమే..

సానియా మీర్జా గతంలో చేసినా, ప్రస్తుతం చేస్తున్నా, భవిష్యత్తులో చేయబోయే సామాజిక సేవా కార్యక్రమాలు పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయాలని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. సానియా స్వయంగా ధ్రువీకరించకుండా ఆమె పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

తన కుమార్తె చేసే సేవా కార్యక్రమాలను ప్రచారం చేసుకోవాలా వద్దా అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయమని, ఆమె అనుమతి లేదా ధ్రువీకరణ లేకుండా ఇలాంటి విషయాలను ప్రచారం చేయడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు.

సానియా కూడా తన తండ్రి ఇచ్చిన వివరణను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేయడంతో ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చింది.

ఏఐ ఫొటోలతో తప్పుడు ప్రచారం.. ఫ్యాక్ట్‌ చెక్‌లోనూ వెల్లడి!

ఈ వ్యవహారంపై ummid.com ఫ్యాక్ట్‌ చెక్‌ నిర్వహించగా వైరల్‌ ఫొటో ఏఐ ద్వారా రూపొందించినదిగా గుర్తించింది. ఆ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం HIVE Detect అనే ఏఐ గుర్తింపు సాధనం ఆ ఫొటో ఏఐతో తయారయ్యే అవకాశం 99.8 శాతంగా చూపించింది. SightEngine అనే మరో సాధనం కూడా ఆ చిత్రం ఏఐ ద్వారా రూపొందినదేనని సూచించింది.

అంతేకాకుండా, సానియా మీర్జా మసీదు నిర్మాణానికి భూమి విరాళంగా ఇచ్చినట్లు ధ్రువీకరించే అధికారిక పత్రాలు, విశ్వసనీయ ఆధారాలు కూడా వెలుగులోకి రాలేదు. మరోవైపు అజారుద్దీన్‌ కార్యాలయం నుంచి కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ధ్రువీకరణ లభించలేదని సంబంధిత ఫ్యాక్ట్‌ చెక్‌ కథనం పేర్కొంది.

సెలబ్రిటీల పేరుతో ఫేక్‌ ప్రచారాలు.. నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలి!

సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఏఐ ద్వారా అసలైన ఫొటోల మాదిరిగా కనిపించే చిత్రాలను సృష్టించడం సులభమవుతోంది. దీంతో ప్రముఖుల పేర్లతో తప్పుడు వార్తలు, కల్పిత ఫొటోలు సోషల్‌ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా మతపరమైన అంశాలకు సంబంధించిన వార్తలు కావడంతో వాటిని నిజమని నమ్మి మరింతమంది షేర్‌ చేసే ప్రమాదం ఉంది.

సానియా మీర్జా విషయంలోనూ ఇదే తరహాలో ప్రచారం జరిగినట్లు ఆమె తండ్రి వివరణతో స్పష్టమైంది. కాబట్టి సోషల్‌ మీడియాలో కనిపించే ప్రతి ఫొటోను, వార్తను నిజమని నమ్మకుండా అధికారిక ప్రకటనలు, విశ్వసనీయ వార్తా సంస్థల కథనాలు పరిశీలించిన తర్వాతే షేర్‌ చేయాలని సూచిస్తున్నారు.

మొత్తానికి హైదరాబాద్‌లో మసీదు నిర్మాణం కోసం సానియా మీర్జా భూమి విరాళంగా ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తండ్రి ఖండించారు. టెన్నిస్‌ అకాడమీ స్థలంలో మసీదు నిర్మాణం జరగడం లేదని, వైరల్‌ ఫొటో ఏఐ సృష్టేనని స్పష్టం చేయడంతో ఈ ప్రచారానికి తెరపడింది.

Please share