భూమిని పోలిన మరో ప్రపంచం?
భూమి వెలుపల జీవానికి అనుకూలమైన ప్రపంచాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్న గ్రహాల్లో ‘ఎల్ 98-59 డి’ ఒకటి. ఇది భూమికి సుమారు 35 కాంతి సంవత్సరాల దూరంలో, దక్షిణ ఆకాశంలోని ‘వోలాన్స్’ నక్షత్రరాశిలో ఉన్న ఒక బాహ్య గ్రహం (ఎక్సోప్లానెట్). పరిమాణం పరంగా ఇది భూమి కంటే కొంత పెద్దదిగా ఉండటంతో దీనిని ‘సూపర్-ఎర్త్ ’ వర్గంలో చేర్చారు. అయితే ‘సూపర్-ఎర్త్” అనే పేరు ఉన్నంత మాత్రాన ఇది భూమిలాగే ఉంటుందని భావించకూడదు. ఈ పదం కేవలం దాని పరిమాణం, ద్రవ్యరాశిని మాత్రమే సూచిస్తుంది. ఈ గ్రహంపై పరిశోధనలు ప్రధానంగా దాని వాతావరణం, కక్ష్య, అంతర్గత నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంపై సాగుతున్నాయి. అత్యాధునిక అంతరిక్ష టెలిస్కోపులు, స్పెక్ట్రోస్కోపీ వంటి సాంకేతిక పద్ధతుల సహాయంతో ఈ గ్రహం వాతావరణం గుండా ప్రయాణించే నక్షత్ర కాంతిని విశ్లేషించి, అక్కడ ఏ రసాయన మూలకాలు లేదా సమ్మేళనాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, తాజా పరిశీలనల్లో ఈ గ్రహం వాతావరణంలో కొన్ని అసాధారణ రసాయన సంకేతాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే అవి జీవం ఉనికిని సూచిస్తున్నాయని ఇప్పుడే నిర్ధారించడానికి వీల్లేదని పరిశోధకులు అంటున్నారు. అలాంటి రసాయనాలు అగ్నిపర్వత చర్యలు, అధిక ఉష్ణోగ్రతలు లేదా ఇతర సహజ భౌతిక ప్రక్రియల వల్ల కూడా ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఒక సూచన మాత్రమే, తుది నిర్ధారణ కాదు. ఎల్ 98-59 డి వంటి గ్రహాల అధ్యయనం ద్వారా విశ్వంలో గ్రహాలు ఎలా ఏర్పడతాయి, కాలక్రమంలో వాటి వాతావరణాలు ఎలా మారుతాయి, భూమిని పోలిన ప్రపంచాలు ఎంత సాధారణమో తెలుసుకునే అవకాశం లభిస్తోంది. ఈ పరిశోధనలు భూమి వెలుపల జీవం కోసం జరుగుతున్న అన్వేషణకు కూడా కొత్త దిశను చూపిస్తున్నాయి.
