November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

అక్షరాల నుంచి ఆలోచనల దాకా.. గురువే మార్గదర్శి

“మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ” అని మన సంస్కృతి గురువుకు తల్లిదండ్రులతో సమానమైన స్థానం కల్పించింది. మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువు మనకు జ్ఞానాన్ని అందించి జీవితానికి ఒక దిశను చూపిస్తారు. అందుకే గురువు స్థానం సమాజంలో ఎప్పటికీ ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం.. గురువుల సేవలను గుర్తుచేసుకునే ఒక గొప్ప సందర్భం, టీచర్స్ డే సందర్భంగా పలువురు తమ భావాలను “జనంమాట” తో పంచుకున్నారు.

ఒకప్పుడు పాఠశాలలో టీచర్ కనిపిస్తే విద్యార్థులు గౌరవంతో పక్కకు జరిగేవారు. టీచర్ మాటకు ఎంతో విలువ ఉండేది. గురువు మందలించినా, సరిదిద్దినా అది తమ మంచికేనని విద్యార్థులు భావించేవారు. అయితే కాలం మారుతున్న కొద్దీ గురువుల పట్ల ఉండే ఆ గౌరవం ప్రస్తుత తరంలో కొంత తగ్గుతున్నట్టుగా అనిపిస్తోందని రిటైర్డ్ టీచర్ వరలక్ష్మీ అభిప్రాయపడుతున్నారు. విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దడంలో గురువు పాత్ర ఎంత కీలకమో నేటి తరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

అయితే విద్యార్థులు తమను గుర్తుపెట్టుకోవడం, సంవత్సరాలు గడిచినా పలకరించడం గురువులకు ఎంతో ఆనందాన్ని, గౌరవాన్ని ఇస్తుందని, రిటైర్డ్ టీచర్ డాక్టర్ బి.ఎల్. ప్రసూన చెప్పారు, పాత విద్యార్థులు ఎక్కడైనా కనిపించి గుర్తుపట్టి పలకరించినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిదని అన్నారు. తాము బోధించిన విద్యార్థులు జీవితంలో ఎదిగి, తమను గుర్తుంచుకోవడమే ఒక గురువుకు దక్కే గొప్ప గౌరవమని ఆమె భావిస్తున్నారు.

గురువు అంటే కేవలం పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను బోధించే వ్యక్తి కాదు. విద్యార్థి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మార్గదర్శి. “టీచర్ బాధ్యత చదువు చెప్పడంతో తీరిపోదు” అని లక్ష్మీనారాయణ అంటున్నారు. విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి, మంచి విలువలను నేర్పించి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని కల్పించడం కూడా గురువు బాధ్యతలో భాగమేనన్నారు.

ఇదే విషయాన్ని ప్రధ్యుమ్ని మరింత స్పష్టంగా చెబుతున్నారు. “విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే” అని ఆమె అభిప్రాయపడుతున్నారు. ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేకమైన ప్రతిభతో పుడతాడు. ఆ ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో నడిపించడం గురువు చేతుల్లోనే ఉంటుంది. ఒక మంచి గురువు ఒక విద్యార్థి జీవితాన్నే కాదు.. అతని ద్వారా ఒక కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని కూడా ప్రభావితం చేయగలడన్నది ఆమె అభిప్రాయం.

ఉపాధ్యాయ వృత్తి మిగతా ఉద్యోగాలకంటే భిన్నమైనది. ఎందుకంటే ఒక టీచర్ చేతుల్లో భవిష్యత్ తరాల నిర్మాణం ఉంటుంది. “టీచర్ ఉద్యోగం అనేది ఒక వృత్తిగా కాకుండా ఒక బాధ్యతగా నిర్వహించాలి” అని బి.ఎన్.ఎల్. శిరీష అంటున్నారు. సమాజ నిర్మాణంలో తమ పాత్రను గుర్తించి, ప్రతి విద్యార్థిని తన సొంత బిడ్డలా భావించి పనిచేసినప్పుడే ఉపాధ్యాయ వృత్తికి నిజమైన గౌరవం లభిస్తుందని ఆమె వివరించారు.

గురువుకు తనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు పంచుకోవడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. “మనకు వచ్చిన సబ్జెక్ట్ ఇతరులకు చెప్పడంలో ఆనందం ఉంటుంది. అందుకే నాకు నచ్చిన సబ్జెక్ట్ గురించి చెప్తుంటాను” అని యశస్విని చెబుతున్నారు. జ్ఞానం పంచుకున్న కొద్దీ పెరుగుతుందని ఆమె అంటున్నారు

నేటి విద్యార్థుల్లోనూ గురువు పట్ల గౌరవం, ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆకర్షణ కనిపిస్తోంది. విద్యార్థిని మౌక్తిక మాట్లాడుతూ, “టీచర్ అంటే చాలా గౌరవం. అందుకే టీచర్ అవ్వాలనుకుంటున్నాను” అని చెప్పడం ఆశాజనకమైన విషయం. గురువు పట్ల గౌరవం ఉండటం, తాము కూడా భవిష్యత్తులో గురువులుగా మారాలనుకోవడం మంచి విలువలు ఇంకా మనలో బతికే ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది.

నిజానికి గురువు ఇచ్చే జ్ఞానానికి విలువను డబ్బుతో కొలవలేం. తాను బోధించిన విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్నప్పుడు గురువు పొందే ఆనందం మరే బహుమతితోనూ సమానం కాదు. ఒకప్పుడు తమ తరగతి గదిలో కూర్చున్న చిన్నారి.. ఏళ్ల తర్వాత ఒక మంచి ఉద్యోగంలోనో, ఉన్నత స్థానంలోనో కనిపించి “సార్.. మేడమ్.. మీరు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది” అని అంటే అదే గురువుకు లభించే అసలైన పురస్కారం.

అందుకే టీచర్స్ డే అనేది కేవలం గురువులకు శుభాకాంక్షలు చెప్పే రోజు మాత్రమే కాదు. మన జీవితాన్ని ప్రభావితం చేసిన గురువులను ఒక్కసారి గుర్తుచేసుకునే రోజు. మనకు అక్షరాలు నేర్పిన తొలి గురువు నుంచి, జీవితంలో ముందుకు సాగేందుకు మార్గనిర్దేశం చేసిన ప్రతి ఉపాధ్యాయుడి వరకు అందరికీ కృతజ్ఞతలు చెప్పే రోజు.

గురువు ఒక దీపం.. తాను వెలుగుతూ, మరెందరో జీవితాలను వెలిగిస్తాడు. ఆ వెలుగును గౌరవించడం ప్రతి విద్యార్థి బాధ్యత. గురువుల పట్ల గౌరవం తరతరాలకు కొనసాగినప్పుడే సమాజంలో విలువలు, సంస్కారం, మానవత్వం నిలిచిపోతాయి.

ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి గురువుకూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుదాం.

“గురువును గౌరవిద్దాం.. గురువు చూపిన మార్గంలో నడుద్దాం.. మంచి సమాజాన్ని నిర్మిద్దాం.”

Please share