November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

కేసీఆర్ ఫాంహౌస్‌ పై విచారణకు సీఎం ఆదేశాలు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భూవ్యవహారాలపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 22A అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌ కు సంబంధించిన భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహించాలని, నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోకపోతే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కేసీఆర్ ఫాంహౌస్‌ కు సంబంధించిన భూములపై 30 రోజుల్లో విచారణ నివేదిక సమర్పించాలని సీఎం స్పష్టం చేశారు. ఫాంహౌస్ పరిధిలో ఉన్న భూముల వివరాలను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూమి ఏదైనా ఉంటే గుర్తించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. భూములను స్వాధీనం చేసుకున్న అనంతరం పేదలకు, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు అందజేస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

కేసీఆర్ కుటుంబానికి చెందిన ఇతర భూములపై కూడా సీఎం పలు ఆరోపణలు చేశారు. కేటీఆర్ ఫాంహౌస్‌కు సంబంధించిన భూములు గతంలో చోటుచేసుకున్న సత్యం కంప్యూటర్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నవని ఆయన పేర్కొన్నారు. ఆ భూములు కేటీఆర్ బంధువుల పేర్లకు బదిలీ అయ్యాయని ఆరోపించారు.

మాజీ మంత్రి హరీశ్ రావు ఫాంహౌస్‌కు రహదారి నిర్మాణంలో సిద్దిపేట మున్సిపాలిటీ నిధులు ఉపయోగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇరిగేషన్ అవసరాల కోసం తీసుకున్న భూమిలోనే ఆ ఫాంహౌస్ ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలోని సుమారు 120 ఎకరాల భూమికి సంబంధించి హరీశ్ రావు కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు చేశారు.

తెలంగాణ ఉద్యమం, ధరణి వ్యవస్థను ఉపయోగించుకుని భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని సీఎం ఆరోపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు పేర్కొన్న భూముల వివరాలను కూడా వెల్లడించారు.

రేవంత్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం, కల్వకుంట్ల కుటుంబానికి మొత్తం 440 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్, ఆయన భార్య పేర్లపై 67 ఎకరాలు, కేటీఆర్ కుటుంబంలోని నలుగురి పేర్లపై 123 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో కేటీఆర్ పేరుపై 49.5 ఎకరాలు, శైలిమ పేరుపై 17.5 ఎకరాలు, అలేఖ్య పేరుపై 9.38 ఎకరాలు, హిమాన్షు పేరుపై 46.3 ఎకరాలు ఉన్నట్లు సీఎం పేర్కొన్నారు.

అదేవిధంగా హరీశ్ రావు కుటుంబానికి 30 ఎకరాలు, కవిత కుటుంబానికి 37 ఎకరాలు, సంతోష్ రావు కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్ రావు పేరుపై 52 ఎకరాలు, కొండల్ రావు పేరుపై 48 ఎకరాల భూమి ఉన్నట్లు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు.

కేసీఆర్ కుటుంబంతో పాటుగా మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్ రెడ్డి, ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని తమ పేరున బదలాయించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఎల్.భి.నగర్ వాసులకు తీపి కబురు అందించిన రేవంత్ https://janammata.net/lb-nagar/

జనంమాట – మీ గొంతు మా వేదిక

మీ సమస్యలు, అభిప్రాయాలు, వ్యాసాలు, సాహిత్యం లేదా ఏ అంశంపై మీ ఆలోచనలైనా మాతో పంచుకోండి. మీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా జనంమాట నిలుస్తుంది. మీ రచనలను మాకు పంపండి—అర్హమైన కంటెంట్‌ను పరిశీలించి ప్రచురిస్తాం.

వివరాలకు:

Email: Satyamediasolutions@gmail.com

Phone Number: 97045 35591

Please share