November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

MLC ఓటు ఉన్నా సరే, మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రక్రియ ప్రారంభమైంది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు డి-నోవో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ తాజాగా Form-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పాత ఓటర్లకు కూడా తప్పని కొత్త దరఖాస్తు

ఈసారి ఓటర్లకు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. గతంలో Form-18 ద్వారా దరఖాస్తు చేసి ఓటరుగా నమోదైనప్పటికీ, ప్రస్తుత డి-నోవో ప్రక్రియలో కొత్తగా Form-18 సమర్పించాల్సి ఉంటుంది.

అంటే గతంలో ఓటు హక్కు కలిగి ఉన్నామని భావించి ఈసారి దరఖాస్తు చేయకుండా ఉండకూడదు. అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ తాజా ఓటర్ల జాబితాలో చేరేందుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నవంబర్ 1, 2026 అర్హత తేదీ

గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీకి 01-11-2026ను అర్హత తేదీగా నిర్ణయించారు. అర్హత కలిగిన వారు నిర్ణీత గడువులో Form-18 సమర్పించాలి.

Form-18 దరఖాస్తుల స్వీకరణకు 06-11-2026 చివరి తేదీ. కాబట్టి అర్హులైన గ్రాడ్యుయేట్లు చివరి రోజు వరకు వేచి ఉండకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎన్నికల రోల్స్ పూర్తి షెడ్యూల్

  • సెప్టెంబర్ 28, 2026: ప్రజా ప్రకటన
  • అక్టోబర్ 15, 2026: తొలి పునఃప్రచురణ
  • అక్టోబర్ 25, 2026: రెండో పునఃప్రచురణ
  • నవంబర్ 6, 2026: Form-18 దరఖాస్తులకు చివరి తేదీ
  • నవంబర్ 20, 2026: ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ముద్రణ
  • నవంబర్ 25, 2026: డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ
  • నవంబర్ 25–డిసెంబర్ 10, 2026: క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ
  • డిసెంబర్ 25, 2026: క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం, సప్లిమెంట్ల ముద్రణ
  • డిసెంబర్ 30, 2026: తుది ఓటర్ల జాబితా ప్రచురణ

రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు వర్తింపు

ఈ ప్రక్రియ మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంతో పాటు వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి వర్తిస్తుంది.

అందువల్ల ఈ నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన గ్రాడ్యుయేట్లు “నా పేరు ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉంది” అని నిర్లక్ష్యం చేయకుండా కొత్తగా Form-18 దరఖాస్తు చేయడం తప్పనిసరి.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. పాత ఓటు నమోదు ఉన్నా సరే, మళ్లీ దరఖాస్తు చేయాలి. ఇక్కడున్న ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో మీరు ఓటరుగా నమోదు కావచ్చు…https://ceotelangana.nic.in/

Please share