ఒక ఊరి కథ..
నిజమే.. ఇది ఒక ఊరి కథ.. బహుశా ఎన్నో ఊర్లలో ఇలాంటి కథలే ఉండవచ్చు. కాదనలేం. ఇది ఒక రైతు కుటుంబం కథ. ఇక్కడ కూడా అదే సూత్రం.. ఎన్నో వేల కుటుంబాల కథ కావచ్చు. ఏదిఏమైనా ఇది మనిషి లోపల పుట్టిన చైతన్యానికి… లక్ష్యాన్ని చేరడానికి ప్రారంభమయ్యే ప్రస్థానానికి సంబంధించిన కథ. —
పేరుది ఏముందు? ఈ వ్యవసాయిక దేశంలో ఒక ఊరు మాది.. పటంలో చూస్తే ఆ ఊరు పచ్చగా మెరిసిపోతుంది. చెరువులు, పొలాలు, కాలువలు… అన్నీ జీవంతో నిండినట్టు కనిపిస్తాయి. కానీ నేల మీద అడుగు పెట్టి నడిస్తే మాత్రం ఆ పచ్చ రంగు ఒక భ్రమ అని అర్థమవుతుంది. ఆ పచ్చదనం ఎండిపోయిన గాయాల్లా, పాత గాయాలపై మిగిలిన మచ్చలల్లా కనిపిస్తుంది. వాన కోసం ఎదురుచూసి, వాన పడితే వరదకు భయపడే నేల అది. జీవితం అంతా ఎదురు చూపులు, నిరాశల మధ్య ఊగిసలాడే నేల.
మా తాతముత్తాతల మాదిరిగా… నేను కూడా ఒక రైతునే. తరతరాలుగా మాది వ్యవసాయిక కుటుంబమే. దేశానికి వెన్నుముకగా నిలుస్తున్నప్పటికీ, రైతు గర్వపడాల్సిన సందర్భం లేని.. రాని దుస్థితి. ఇక్కడ రైతు జీవితం అంటే గుర్తింపు కాదు.. శిక్ష. పుట్టుకతోనే విధించబడిన శిక్ష. ఎంచుకోని జీవితం. తప్పించుకోలేని కర్మ.
చిన్నతనం నుంచీ నా ప్రపంచం పొలాలే.
పొలాల మధ్య తిరుగుతూ పెరిగాను. నాన్న నాగలి పట్టుకుని ముందుకు నడిస్తే, నేనూ వెనకే నడిచేవాణ్ని. ఆయన అడుగుల వెంట అడుగులు వేసేవాణ్ని. నేల వాసన నాకు దేవుడిలా అనిపించేది. విత్తనం నేలలో పడితే, ఆ మట్టిలోంచి ఆశ మొలుస్తుందని నమ్మేవాణ్ని. ఆ రోజుల్లో నాకు తెలియదు.. ఆశ కూడా అప్పుల్లా పెరుగుతుందని, ఒక దశలో ఊపిరి ఆడకుండా చేస్తుందని.
మా ఊరి చివర ఇప్పటికీ ఒక బావి ఉంది.
ఒకప్పుడు ఆ బావి చుట్టూ పిల్లల నవ్వులు, మహిళల పాటలు, నీళ్లు తోడే కుండల చప్పుళ్లు. వేసవిలో కూడా ఆ బావి ఎండిపోలేదు. ఆ నీళ్లే మా పొలాలకు ప్రాణం. ఇప్పుడు ఆ బావిలోకి చూస్తే మనిషి ముఖం కూడా కనిపించదు. అంతా చీకటి. అంత ఖాళీ. ఆ బావి మా ఊరి జీవితానికి ప్రతీకలా మారింది. ఒకప్పుడు నిండుగా…. ఇప్పుడు శూన్యంగా.
మా పొలాలు కూడా అలాగే. బీడుబడ్డ నేల. నడవని నాగళ్లు. దన్నులేని పైరులు. వర్షం కోసం ఆకాశం వైపు చూడటం మా అలవాటు. వర్షం రాకపోతే ఆకాశాన్ని తిట్టుకుంటాం. వర్షం ఎక్కువగా పడితే భయపడతాం. పంట పండితే ధర లేదు. ధర ఉంటే దళారులు. దళారులు లేకపోతే కార్పొరేట్లు. మధ్యలో రైతు మాత్రం ఎప్పుడూ ఓడిపోయేవాడే.
నాన్న ఎప్పుడూ ‘ఈ నేల మనదేరా… కానీ మనం దీని యజమానులం కాదు.. కూలీలం’ అంటుండేవాడు. ఆ మాటలు విని చాదస్తం అనుకునేవాడిని. నవ్వుకునేవాడిని. ఇప్పుడు ఆ నవ్వు రావడం మానేసింది. ఆ మాట ప్రతి రోజు గుండెల్లో గుచ్చుకుంటుంది.
ఒక సంవత్సరం బంగారం తాకట్టు పెట్టాం. కొన్న విత్తనం నేలలో పడింది. మొలక వచ్చింది. కొద్ది రోజులు ఆశ మళ్లీ పుట్టింది. కానీ పంట కాయలేదు. మొక్కలు మొహం తిప్పుకున్నట్టుగా ఎండిపోయాయి. విత్తనాలు కూడా మోసం చేస్తాయన్న సంగతి అప్పుడు నాకు అర్థమైంది. కొన్న విత్తనాలు నకిలీవి… అప్పు మాత్రం వడ్డీతోసహా ‘అసలే’. రైతు మోసానికి గురయ్యేది కేవలం మార్కెట్లోనే కాదు, నేల దగ్గర కూడా. రైతుల కష్టాలు కేవలం విత్తనాలకే పరిమితం కాదు. మేము ఎరువుల కోసం మండల కార్యాలయానికి తిరిగాం. స్టాక్ లేదు అన్నారు. ప్రైవేట్లో ఉంది. కానీ ధర మూడింతలు. ఈ పరిస్థితికి కేంద్రం కారణమని రాష్ట్రం… రాష్ట్రమే కారణమని కేంద్రం.. ఒకరిమీద మరొకరి విమర్శలు.. నెపం ఎవరు ఎవరి మీదకు నెట్టినా, బాధితులు మాత్రం రైతులే. వ్యవసాయానికి చేసిన అప్పు పెరిగింది. బాధ్యతలు మెడకు చుట్టుకున్న తాళ్లలా బిగుసుకున్నాయి.
ఎంత అప్పు ఉంది? వడ్డీ ఎంత ? ఎప్పుడు కట్టాలి? ఇవీ అమ్మ రోజూ వేసే లెక్కలు. తాకట్టులో ఉన్న బంగారం గురించి మరో చింత. నాన్న మౌనంగా ఉండేవాడు. ఆ మౌనం కూడా ఒక రోదననే, కానీ అప్పుడు నాకు తెలియలేదు. మాటలేని బాధ ఎంత భయంకరమో, అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు.
మా ఊర్లో ఒకరొకరు ఆత్మహత్య చేసుకోవడం కొత్త కాదు. అది పెద్ద వార్త కూడా కాదు. రైతు చావు.. సాధారణం అయిపోయింది. పత్రికల్లో అది ఒక చిన్న కాలమ్ వార్త. రెండు రోజుల్లో అందరూ మరచిపోతారు. బాధిత కుటుంబం తప్ప. ఒక రోజు నాన్న పొలం చివర నిలబడి ఉన్నాడు.
ఎండ మండిపోతున్నా చెమట లేదు. కళ్లలో నీళ్లు కూడా లేవు.
ఆ చూపు నాకు ఇప్పటికీ గుర్తుంది… అది మనిషి చూపు కాదు, ఓటమి బాధ.. జీవితంపై ఆశ నశించిన దైన్యం..
నాన్నా ఎందుకు అట్లా ఉన్నావ్? అని అడిగాను. ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు రాత్రి నాన్న చనిపోయాడు. ఇక ఎప్పటికీ మాట్లాడే అవరం లేకుండా.. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తర్వాత తెలిసింది. నాన్న వెళ్లిపోయాడు.. అమ్మ జీవచ్ఛవంలా మిగిలింది.
ఆ మరణానికి కారణం.. అప్పులు.. అలాంటి దుస్థితిని కల్పించిన వ్యవస్థ.. ఆ రోజు నేను రైతుగా మాత్రమే కాదు, ఒక ప్రశ్నగా కూడా మిగిలాను.. ఈ నేల కోసం ప్రాణం పెట్టిన మనిషికి ఈ నేల ఏమిచ్చింది? ఈ దేశం రైతునికి ఎందుకు ఇంత క్రూరంగా మారింది? మా ఇంట్లో నాగలి మూలకు పోయింది. అమ్మ చూపు ఎప్పుడూ నేల మీదే. ఊర్లో వాళ్లు వచ్చి ఓదార్చారు.
కానీ ఓదార్పు కడుపు నింపదు. ఓదార్పు అప్పులు తీరుస్తూ లేదు.
గత్యంతరం లేదు.. నేను వలస వెళ్లాను. పట్టణంలో భవన నిర్మాణంలో కూలీగా.. ఇటుకలు మోశాను… ఇసుక మోశాను… ఎండలో, వానలో పని చేశాను.
కానీ, నా మనసు మాత్రం మా ఊరి చుట్టూనే తిరిగేదు. కానీ ప్రతి ఇటుకలోనూ మా పొలమే… ప్రతి చెమట చుక్కలో నాన్న ముఖమే. ఇక్కడ.. ఈ మహానగరంలో నగరంలో నేనొక్కడినే కాదు. మా ఊరి వాళ్లు, పక్క ఊరి వాళ్లు.. ఇలా ఎందరో.. అందరూ రైతు పిల్లలే. రైతు పేదరికం ఇక్కడ కూలీ పేదరికంగా మారింది అంతే. అక్కడే ఒక రోజు రైతు సంఘం మీటింగ్కు వెళ్లాను. మొదట వినడానికి మాత్రమే. ఏమీ మారుతుందనుకోలేదు. అక్కడ ఒక పెద్దాయన మాట్లాడుతూ, ‘రైతు ఒంటరిగా పోరాడితే చస్తాడు. కలిసి నిలబడితే మార్పు వస్తుంది’ అన్నాడు. ఆ మాటలు నా గుండెల్లో బలంగా నాటుకున్నాయి. ఆ మాట నాన్నకు చెప్పలేకపోయానని బాధ పడ్డాను. ఎందుకంటే నాన్న ఒంటరిగా పోరాడాడు. ఒంటరిగా ఓడిపోయాడు. ఇప్పుడు పరిస్థితిని మార్చాలి. నాన్న లాంటి ఎంతో మందికి నేను నిజం ఏదో చెప్పాలి. అందుకే, నేను తిరిగి ఊరికి వచ్చాను. పొలంలో అడుగు పెట్టాను. ఎండిపోయిన నేల నన్ను చూసి మౌనంగా నవ్వింది. ఊర్లో మిత్రులను కలిపాను. వలసలకు వెళ్లగా, మిగిలిన కొద్ది మంది రైతులతో మాట్లాడాను. మొదట భయం… తర్వాత కోపం… ఆ తర్వాత ప్రశ్నలు.
ఎందుకు విత్తనాలు మన చేతుల్లో లేవు? ఎందుకు ధర మనం నిర్ణయించం? ఎందుకు వ్యవసాయం లాభం కాకుండా శిక్ష అయింది? అంతా కలిశాం. సంఘం పెట్టాం. అది చిన్నదే. కానీ, మనసుల్ని కలిపింది. మండల కార్యాలయం ముందు ధరల కోసం ధర్నా చేశాం. పత్రికల్లో చిన్న వార్త వచ్చింది. అధికారులు వచ్చారు. వాళ్లు ఎప్పటి మాదిరిగానే మాటలు చెప్పారు. హామీలు ఇచ్చారు. మేము ప్రశ్నలు వేసాం. మాటలు కాదు, చేతలు అవసరమని స్పష్టం చేశాం. మార్పు ఒక్క రోజులో రాలేదు. కానీ భయం తగ్గింది. అది చాలా గొప్ప మార్పు. ఈరోజు కూడా మా పొలాలు అంత పచ్చగా లేవు. రైతుల కళ్లలో వెలుగు ఉంది. నాన్న చనిపోయిన నేల మీద నేను నిలబడి మాట్లాడగలుగుతున్నాను.
ఇప్పుడు నేను చెబుతాను… ఈ వ్యవసాయిక దేశంలో రైతులే పేదలన్నది నిజం. కానీ, పేదలుగానే ఉండాల్సిన అవసరం లేదు. పచ్చని నేలను తిరిగి పిలుస్తాం. ఆశలను మళ్లీ పండిస్తాం.
పల్లెల్లో వెలుగులు నింపుతాం. ఎందుకంటే, రైతు బతికితేనే దేశం బతుకుతుంది.
