నేను బతికే ఉన్నానా?
నేను ఇప్పటికీ కొన్నిరాత్రులు ఒకే కలతో మేల్కొంటాను. కాదు… అది కల కాదు, ఒకప్పుడు నాకు జీవించడానికి ఇచ్చిన ఆశ. నెమ్మదిగా ఒక సూపర్మార్కెట్లో నడుస్తూ, షెల్ఫ్‌లపై ఉన్న రంగురంగుల ప్యాకెట్లను తడిముతూ, వాసనల్ని పీల్చుకుంటూ, నాకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవడం. గాజాలో బంధిగా ఉన్న రెండేళ్లపాటు అదే నా స్వర్గం. ఆకలితో మగ్గుతున్న శరీరానికి కాదు, చచ్చిపోకుండా ఉంచుకున్న మనసుకు అది ఒక్కటే ఆశ. జైలు నుంచి నేను విడుదలయ్యాను. ‘నువ్వు చెర నుంచి స్వేచ్ఛలోకి వచ్చావు’ అని అంటారు అందరూ. కానీ, వాస్తవం ఏంటంటే, నేను విడుదలైన రోజే నా కలలు మారిపోయాయి.
ఇప్పుడు కళ్లుమూసిన ప్రతిసారి నేను మళ్లీ ఆ సొరంగంలోనే ఉంటాను. భూమికి ముప్పు మీటర్ల లోతులో, రెండు చదరపు మీటర్ల చీకటి గదిలో, మురికి ఫోమ్ పరుపుపై. ఐదుగురితో కలిసి శ్వాస తీసుకోవడమే శిక్షలా అనిపించిన చోట. ఆకలి బాధ నుంచి తప్పించుకోవడానికి నేను చేసేది ఒక్కటే… అదే, సిమెంట్‌లోని ప్రతి టైల్‌ను లెక్కపెట్టడం, ప్రతి చీలికను గుర్తుపెట్టుకోవడం. అది నాకు మిగిలిన చివరి నియంత్రణ. నా చేతిలో ఉన్న… నా ఆధీనంలో మిగిలిన హక్కు. నిజం చెప్పాలంటే, మరణానికి ముందు ఒక మనిషి ఉండగలిగే అతి దిగువ స్థాయిలో నేను ఉన్నాను. తినాలా వద్దా, ఏం తినాలి? ఎంత తినాలి? ఎప్పుడు స్నానం చేయాలి? ఇలాంటివి చాలా మందికి సాధారణమై విషయాలు కావచ్చు. కానీ నాకు మాత్రం విశ్వ రసహ్యాలు విసురుతున్న సమాధానం లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఎందుకంటే… ఏదీ నా చేతిలో లేదు. ఒక దశలో నేను, శారీరకంగానేకాదు.. మానసికంగా కూడా క్షీణించిపోయాను.
నా వెన్నెముక నుంచి బయటకు ఉబ్బిన ప్రతి వెర్టీబ్రాను లెక్కపెట్టగలిగేవాడిని. అద్దం అవసరం లేదు. నా శరీరమే నాకు సాక్ష్యం. ఈ మార్పులు సంభవించకముందు… యుద్ధం మా పరిస్థితులను అస్తవ్యస్తం చేయడానికి ముందు.. నా జీవితం మరోలా ఉండేది. అరాద్‌లో మా కుటుంబ బేకరీ. పిండి వాసన, వేడిగా ఉన్న బ్రెడ్ తాకిన చేతులు. ఫైనాన్స్, పెట్టుబడులపై చదువులు. జీవితం నా చేతుల్లోనే ఉందని అనుకున్న రోజులు. నోవా సంగీతోత్సవానికి వెళ్లిన రోజు కూడా అలానే అనిపించింది. కానీ ఒక రోజు హఠాత్తుగా ఆకాశం నుంచి రాకెట్లు పడ్డాయి. చుట్టూ అరుపులు, పరుగులు, భయం. నేను నా సన్నిహిత మిత్రుడితో కలిసి ఇతరులను కాపాడాలని ప్రయత్నించాను. ‘పసుపు రంగు డంప్‌స్టర్‌లో దాక్కోవద్దు, అది మృత్యు పాశం. నాతో రండి’ అంటూ ఎంతమందినో వేడుకున్నాను. చాలా మంది రాలేదు. వాళ్లను నేను రక్షించలేకపోయాను.
రెండేళ్లపాటు వాళ్లకు ఏమైందో నాకు తెలియదు. విడుదలయ్యాక తెలిసింది.. వాళ్లు బతకలేదని. బతికిన నాకు బతుకే లేదని కూడా అర్థమైంది. నన్ను ఎందుకు నిర్బంధించారో తెలియదు? నేను చేసిన తప్పు ఏమిటో అంతకంటే తెలియదు. ఎన్నడూ ఊహించని జైలు జీవితం… యుగాలుగా గడిచే క్షణాలు.. రోజుకు ఒక్కసారే దొరికే కొద్దిపాటి ఆహారం, నీరు. మధ్యలో ఇజ్రాయెల్ బాంబుల శబ్దాలు. మందుల్లేకుండా కొవిడ్.. ఇతర వ్యాధులు సరేసరి. వద్దన్నా వెంటపడే ఆకలి. అక్కడ కాపలాగా ఉన్న ఇజ్రాయెల్ సైనికుల దౌర్జన్యాలు. సైకిల్ గొలుసులను కొరడాల్లా మార్చి మమ్మల్ని కొట్టేవారు. పెద్ద ఉంగరాలు వేసుకున్న చేతులు నా శరీరంపై మచ్చలు వేశాయి.
అరవాలనిపించేది. కానీ అరిచినా… వినేవాళ్లు ఎవరూ ఉండరు. భూమి లోపల, ప్రపంచం మరిచిపోయిన చోట మేమున్నాం. చివరి మూడు నెలలు నరకం కంటే ఘోరం. ఒంటరిగా ఉంచారు. నా సృహ నెమ్మదిగా జారిపోతున్నట్టు అనిపించింది. అప్పుడు ఒక చిన్న వెలుగు కనిపించింది. నీరు, పుచ్చిపోయిన పిటా రొట్టెతో శబ్బాత్ను గుర్తుచేసుకున్నాం. స్కల్క్యాప్కు టాయిలెట్ పేపర్ రోల్‌లోని ఒక చిన్న చదరాన్ని వాడుకున్నాం. ఒక రోజు, నేను పూర్తిగా విరిగిపోయిన క్షణంలో, చావే సులువు అనిపించిన వేళ… రేడియో ఆన్ చేశాను. అందులో వినిపిస్తున్నది నా తల్లి స్వరం. అది కలా? భ్రమా? తెలియదు. కానీ అది నాకు అజ్ఞాత సేవకుడు పంపిన సందేశంలా అనిపించింది.. ‘ఇంకొంచెం కాలం బతుకు’ అనే మాట వినిపించింది. ఆ సందేశ ప్రభావమో లేక ఆత్మహత్య చేసుకోవాలంటే భయమోగానీ, నేను మరణాన్ని వాయిదా వేసుకున్నాను. ఇప్పుడు బయట పడ్డాను. ఇప్పటి వరకూ, నేను చనిపోయిన మనిషి శరీరంలో జీవించినట్టు బతికాను. ఇప్పుడు ఆ సమాధి నుంచి బయటపడ్డాను. అంతకు మించి జరిగిన అద్భుతం ఇంకేమీ కాదు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నేను బయటకు వచ్చాను. డిమోనాలో నా ఇంటి ముందు అమెరికా జెండాలు ఎగురుతున్నాయి. అందరూ నన్ను హీరో అంటున్నారు. కానీ నాకు తెలుసు.. బతకాలనే కోరిక హీరోలను కాదు, మనుషులను చేస్తుంది. యుద్ధం ముగిసిందంటారు. కానీ నా యుద్ధం ఇప్పుడే మొదలైంది. రాత్రి చిన్న శబ్దం కూడా నన్ను సొరంగంలోకి లాగేస్తుంది. నిద్ర పట్టదు. అయినా నా కథ చెబుతాను. ఎందుకంటే ఇది నిజమని చెప్పడానికి నేనే సాక్ష్యం. నేను నా శరీరంతో అనుభవించాను. నా కళ్లతో చూశాను. ఇది జీవితమంటే ఎలా నమ్ముతాను? ఇదే జీవితమంటే ఎందుకు ఒప్పుకుంటాను? తెలిసిన యుద్ధం నుంచి తెలియని యుద్ధంలోకి వచ్చిపడ్డాను…. జీవిస్తూ చచ్చిపోయాను..
