November 28, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కోవా లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల మిగిలిన రోజులకు సస్పెండ్ చేశారు.

సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద జరిగిన ‘చావుడప్పు’ నిరసన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో సభలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ సభ్యులు సభా కార్యకలాపాలకు పదేపదే ఆటంకం కలిగిస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు.

సుమారు గంటపాటు సభా కార్యక్రమాలు సజావుగా సాగకుండా అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.

అనంతరం స్పీకర్ బీఆర్ఎస్ సభ్యులను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అంతకు ముందు సమావేశాలు మొదలైన వెంటనే ఎర్రవెల్లి ఘటనపై సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌ వద్ద కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేతలు, దళిత సంఘాలు నిన్న నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఆందోళన అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలు అక్కడ శుద్ధి కార్యక్రమం చేపట్టారనే అంశాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సభలో ప్రస్తావించారు.

ఈ ఘటనను మంత్రి తీవ్రంగా ఖండించారు. దళితులు నిరసన చేపట్టిన ప్రదేశాన్ని శుద్ధి చేయడం వెనుక బీఆర్‌ఎస్‌ నాయకుల కుల వివక్ష ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఈ చర్య దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉందని, వారి హక్కులను అవమానించడమేనని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ గేటు వద్ద దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్‌ఎస్‌ నేతలు దూషించిన ఘటనపై వివాదం కొనసాగుతున్న సమయంలోనే తాజా ఘటన వెలుగులోకి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. దళితుల పట్ల బీఆర్‌ఎస్‌ వైఖరిపై సభలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.

మండలి నుండి కూడా ఇద్దరు బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ కు గురయ్యారు. https://janammata.net/telangana-mlc/

Please share