రక్షణ మంత్రినే మందలించిన గార్డ్…
అమెరికాలోని ఆర్లింగ్టన్ నేషనల్ సిమెటరీ లో ఉన్న ‘టామ్ ఆఫ్ ది అన్నోన్ సోల్జర్’ (గుర్తుతెలియని సైనికుడి సమాధి) వద్ద అనుచితంగా ప్రవర్తించిన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆయన సలహాదారుల బృందాన్ని అక్కడ విధుల్లో ఉన్న సైనిక గార్డ్ మందలించారు. సమాధి ఎదుట కొందరు గట్టిగా మాట్లాడటం, నవ్వడం చేయడంతో విధుల్లో ఉన్న గార్డ్ వారిని మౌనంగా ఉండాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అమెరికా ఆర్మీలోని 3వ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ ‘ది ఓల్డ్ గార్డ్’కు చెందిన సైనికుడు ఈ ఘటనలో హెగ్సెత్ బృందాన్ని మౌఖికంగా మందలించారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ వార్తా సంస్థ CNN ప్రచురించింది.
సమాధి వద్ద ఫొటోలు.. పెద్దగా మాట్లాడటంతో అభ్యంతరం
వెటరన్స్ డే (అనుభవజ్ఞుల దినోత్సవం) సందర్భంగా ఆర్లింగ్టన్ నేషనల్ సిమెటరీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పీట్ హెగ్సెత్ తన భార్య జెన్నిఫర్‌తో కలిసి గుర్తుతెలియని సైనికుడి సమాధి వద్దకు వెళ్లారు. ఆయనతో పాటు చీఫ్ ఆఫ్ స్టాఫ్ రికీ బురియా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పాట్రిక్ వీవర్, సీనియర్ అడ్వైజర్, డిప్యూటీ అసిస్టెంట్ టామీ రాడబాగ్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా హెగ్సెత్ సమాధి ముందు నిలబడి ఫొటోలు తీసుకుంటుండగా, ఆయన బృందంలోని కొందరు నవ్వుతూ, గట్టిగా మాట్లాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న టామ్ గార్డ్ వారిని మౌఖికంగా హెచ్చరించారు.
అత్యంత గౌరవప్రదమైన ప్రదేశంలో ఘటన
ఆర్లింగ్టన్ నేషనల్ సిమెటరీలోని టామ్ ఆఫ్ ది అన్నోన్ సోల్జర్ అమెరికా సైనిక చరిత్రలో అత్యంత గౌరవప్రదమైన స్మారక చిహ్నాల్లో ఒకటి. దేశం కోసం ప్రాణత్యాగం చేసినప్పటికీ గుర్తింపు తెలియని సైనికులకు నివాళిగా ఈ సమాధిని ఏర్పాటు చేశారు. ఇక్కడ విధులు నిర్వహించే గార్డులు కఠినమైన క్రమశిక్షణ, సంప్రదాయాలను పాటిస్తారు. ఈ నేపథ్యంలో సమాధి వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
