పాక్ F-16 లను కూల్చిన భారత్-తాజా నివేదికలో వెల్లడి
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన కీలక సైనిక స్థావరాలపై భారత్ చేపట్టిన దాడులకు సంబంధించి తాజాగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. భారత రక్షణ శాఖ తన వార్షిక నివేదికలో ఈ విషయాలను వెళ్లడించింది, జాకోబాబాద్‌లోని షహబాజ్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడిలో పలు పాక్ F-16 యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు ఆ నివేదిక పేర్కొంది.రక్షణ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, జాకోబాబాద్‌లోని షహబాజ్ ఎయిర్‌బేస్‌లోని నాలుగు హ్యాంగర్లను భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. అక్కడ ఉన్న యుద్ధవిమానాలు, AEW&C విమానాలు, డ్రోన్ వ్యవస్థలు కూడా దాడుల ప్రభావానికి గురైనట్లు వెల్లడైంది.
జాకోబాబాద్లోపాక్ F-16 లకు నష్టం
రక్షణ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. మే 10న భారత వైమానిక దళం జాకోబాబాద్‌లోని షహబాజ్ ఎయిర్‌బేస్‌లో నాలుగు హ్యాంగర్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ హ్యాంగర్లలో యుద్ధవిమానాలతో పాటు AEW&C విమానాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు ఉన్నట్లు పేర్కొంది.
ఈ దాడుల్లో పలు పాక్ F-16 విమానాలు ధ్వంసం లేదా దెబ్బతిన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే ఒక AEW&C విమానం, కొన్ని టర్కిష్ తయారీ అకింజి, TB-2 తరహా డ్రోన్లు కూడా దెబ్బతిన్నట్లు తెలిపింది.
పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలపై దాడులు
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఆరు రాడార్లు, రెండు సర్ఫేస్-టు-ఎయిర్ గైడెడ్ వెపన్ ప్రాంతాలను కూడా భారత్ లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
చక్లాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, మురిద్, సర్గోధా, జాకోబాబాద్, భోలారి ప్రాంతాల్లోని పాకిస్థాన్ సైనిక మౌలిక వసతులు, రాడార్లు, కమాండ్ కేంద్రాలపై భారత వైమానిక దళం దాడులు చేసినట్లు నివేదిక పేర్కొంది. సర్గోధా, రహీమ్ యార్ ఖాన్‌లోని రన్వేలు కూడా దెబ్బతిన్నట్లు వెల్లడించింది.
డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్న భారత్
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ నుంచి డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగినప్పుడు భారత వాయు రక్షణ వ్యవస్థ వాటిని ఎదుర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత సైనిక, వైమానిక రక్షణ వ్యవస్థలను సమన్వయం చేయడంలో Integrated Air Command and Control System (IACCS) కీలక పాత్ర పోషించినట్లు పేర్కొంది.
దేశీయ ఆకాష్ వ్యవస్థతో పాటు ఇతర వాయు రక్షణ వ్యవస్థలను సమన్వయం చేస్తూ భారత బలగాలు పాకిస్థాన్ నుంచి వచ్చిన వైమానిక ముప్పులను ఎదుర్కొన్నట్లు నివేదిక వివరించింది.
ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళం సాంకేతిక సామర్థ్యాలు, నెట్వర్క్ ఆధారిత ఆపరేషన్లు కీలకంగా మారినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో సేవలందించిన వైమానిక దళ సిబ్బందికి 219 గ్యాలంట్రీ అవార్డులు అందించినట్లు తెలిపింది.
