సమయాన్ని మనిషి మార్చగలడా?
సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న చర్చల ప్రకారం, భవిష్యత్తులో రోజుకు 25 గంటలు వస్తాయట! ఈ మాట విన్నప్పుడు, ‘ఇంకో గంట దొరికితే పెండింగ్ పనులు పూర్తి చేసుకోవచ్చు, ఆలస్యంగా లేచినా ఇబ్బంది ఉండదు’ అని ఎవరైనా అనుకుంటే తప్పులేదు. కానీ శాస్త్రం చెబుతున్న వాస్తవం మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. సెకను అనే సమయ ప్రమాణాన్ని శాస్త్రవేత్తలు మార్చితే రోజు 25 గంటలు అవుతుంది అనే వారపై సుమారు రెండేళ్లుగా, వాదప్రతివాదనలు జరుగుతునే ఉన్నాయి. అయితే ఇది నిజమైన శాస్త్రీయ ప్రకటన కానని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. యూరప్‌లోని ‘సెర్న్’ సంస్థ ప్రచురించిన ‘ఏప్రిల్ ఫూల్స్’ సరదా కథనంలో భాగంగా వచ్చిన ఆలోచన మాత్రమేనని తేల్చారు. ఏదిఏమైనా, సమయం కొలిచే విధానం చాలా ఖచ్చితంగా ఉండాలి. జిపిఎస్ వ్యవస్థలు, ఉపగ్రహాలు, అంతర్జాతీయ కమ్యూనికేషన్ వ్యవస్థలు సెకను స్థాయి ఖచ్చితత్వంపై ఆధారపడతాయి. అందుకే ఆధునిక ప్రపంచం అటామిక్ క్లాక్‌లను ఉపయోగిస్తుంది. ఇవి సిసియం అణువుల సహజ కంపనాలను ఆధారంగా తీసుకుని ఒక సెకను విలువను నిర్ణయిస్తాయి. ఈ పద్ధతి అత్యంత స్థిరమైనదిగా పరిగణిస్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. సెకను అనేది మనిషి రూపొందించిన కొలత ప్రమాణం. దాని నిర్వచనాన్ని మార్చగలం. కానీ రోజు అనేది భూమి తన అక్షం చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం. అది ప్రకృతి నిర్ణయించే విషయం. మనం గడియారంలోని ప్రమాణాలను మార్చగలం కానీ భూమి భ్రమణాన్ని మార్చలేం. ఉదాహరణకు, ఒక సెకను వ్యవధిని కొద్దిగా మార్చితే ఒక రోజులో ఉండే సెకన్ల సంఖ్య మారుతుంది. కానీ సూర్యుడు ఉదయించి మళ్లీ ఉదయించే వరకు గడిచే అసలు సమయం మారదు. మారేది కేవలం మన గడియారం చూపించే లెక్క మాత్రమే. భూమి భ్రమణం పూర్తిగా స్థిరంగా ఉండదు. చంద్రుడి గురుత్వాకర్షణ, సముద్రపు అలలు, భూమి అంతర్భాగంలోని మార్పులు వంటి కారణాల వల్ల భ్రమణ వేగంలో స్వల్ప మార్పులు వస్తుంటాయి. అందుకే అటామిక్ టైమ్‌కు భూమి ఆధారిత సమయానికి మధ్య తేడా పెరిగినప్పుడు లీప్ సెక్‌ండ వంటి చిన్న సర్దుబాట్లు చేస్తారు. కానీ ఇవి రోజు పొడవును ఒక గంట పెంచే స్థాయిలో ఉండవు. కాబట్టి రోజు 25 గంటలు కావాలంటే మనం సెకను నిర్వచనాన్ని మార్చడం సరిపోదు. భూమి తన అక్షంపై తిరిగే వేగం గణనీయంగా తగ్గాలి. అది మానవ నియంత్రణలో లేని సహజ ప్రక్రియ.
