November 27, 2026

Janammata.net

ప్రజల కోసం… ప్రజల పక్షం

సౌర విద్యుత్తుదే భవిష్యత్తు

v prime solar

సౌర విద్యుత్తు వాడకం వల్ల పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని విప్రైమ్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ కాశీనాధుని రాజేశ్వర్‌ అన్నారు. శ్రీమాన్‌ భగవతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ‘సౌర విద్యుత్తు అవసరం’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సౌరశక్తి వినియోగం, పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యత, భవిష్యత్తులో విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై కార్యక్రమంలో విస్తృతంగా చర్చించారు. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోగోను ఆవిష్కరించిన రాజేశ్వర్‌ మాట్లాడుతూ, భవిష్యత్తు మొత్తం సౌర విద్యుత్తుదేనని వ్యాఖ్యానించారు. సోలార్‌ ఎనర్జీ వినియోగం ద్వారా విద్యుత్తు ఖర్చులను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చని తెలిపారు. బొగ్గు, పెట్రోలు, డీజిల్‌ వంటి సంప్రదాయ ఇంధన వనరుల వినియోగం వల్ల కాలుష్యం పెరుగుతోందని, వాతావరణ మార్పుల ప్రభావాలు తీవ్రతరం అవుతున్నాయని అన్నారు.

ఈ నేపథ్యంలో సూర్యకాంతి రూపంలో ప్రకృతి అందిస్తున్న అపారమైన శక్తిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గృహాలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా సౌర విద్యుత్తు పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని రాజేశ్వర్‌ సూచించారు. సౌర ప్యానళ్ల ఏర్పాటుతో దీర్ఘకాలంలో విద్యుత్తు బిల్లులను తగ్గించుకోవచ్చని, అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్తు వినియోగం పెరిగితే విద్యుత్తు సరఫరా సమస్యలను కొంతవరకు అధిగమించవచ్చని అన్నారు. శ్రీమాన్‌ భగవతి ఫౌండేషన్‌ ఛైర్పర్సన్‌ సరస్వతి నాగభండి మాట్లాడుతూ, విద్యార్థులకు చిన్ననాటి నుంచే పునరుత్పాదక ఇంధన వనరులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో సౌరశక్తి వినియోగంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సౌరశక్తి ప్రయోజనాలు, వినియోగ పద్ధతులు, పర్యావరణ పరిరక్షణలో దాని పాత్రపై ప్రజల్లో చైతన్యం పెంచాలని పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన నంగారా భేరి ఫౌండేషన్‌ చైర్మన్‌ ముఢావత్‌ రాంబల్‌ నాయక్‌ మాట్లాడుతూ, భవిష్యత్తు పునరుత్పాదక ఇంధన వనరులదేనని అన్నారు. సహజ వనరులను సమర్థంగా వినియోగిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. సౌరశక్తి వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన స్వావలంబన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ సోలార్‌ సంస్థల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

Please share